Print

యహువః ప్రధాన యాజకుడిగా ఉండగలడా?

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

ఆదికాండము 14:18లో ప్రధాన యాజకుడు అనే విషయం పరిచయం మనకు చేయబడింది. నిగూఢమైన మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవుని యాజకుడని మనకు తెలుసు. అతడు సర్వోన్నతుడైన దేవుణ్ణి సేవించాడు మరియు అబ్రామును ఆశీర్వదించాడు. అతని ఖచ్చితమైన విధులు అస్పష్టంగా ఉన్నాయి, కానీ ఇది మనకు తెలుసు: అతడు షాలేము రాజు మరియు అతడు మానవజాతి యొక్క ఆ ప్రారంభ రోజులలో భూమిపై యహువః యొక్క మధ్యవర్తిగా పనిచేశాడు. ఇది ఇశ్రాయేలు మరియు లేవీ యాజకత్వం ఉనికికి చాలా ముందు కాలం నాటిది.

అతడు “అత్యున్నతుడైన దేవుణ్ణి సేవించాడు” అనే ప్రకటనను బట్టి ఈ మెల్కీసెదెకు యహువః కాదని స్పష్టమవుతుంది. యహువః తనను తాను సేవించుకున్నాడు అని మనం అనుకోకుండా ఉంటే, ఈ యాజకుడు యహువః కాకుండా మరొకరు అని సహేతుకంగా అర్థం చేసుకోవచ్చు! మెల్కీసెదెకు క్రీస్తు అని, మరియు సనాతన ధర్మానికి చెందిన క్రీస్తు అయితే అతడు కుమారుడైన దేవుడని నమ్మేవారు ఉన్నందున నేను దీనిని ప్రస్తావిస్తున్నాను.

నిజానికి మెల్కీసెదెకు "యహువః కుమారుని వలె" ఉన్నాడు (హెబ్రీ. 7:3), అంటే అతడు యహువః కుమారుడు కాలేడు. మెల్కీసెదెకుకు నమోదు చేయబడిన వంశావళి లేదు (“తండ్రి మరియు తల్లి లేరు,” హెబ్రీ. 7:3, యూదులు వంశావళి తెలియని సారా గురించి చెప్పినట్లు). అతని పితరులు లేవీ మూలాల నుండి కనుగొనబడలేదని మనకు తెలుసు (వచనం 6).

మెల్కీసెదెకు

మెల్కీసెదెకు కేవలం యాజకుడేనా లేక అతడు ప్రధాన యాజకుడని మనం ఊహించగలమా? అతడు సర్వోన్నతుడైన యహువఃకు యాజకుడని వచనం చెబుతోంది. ఇతర యాజకులు కూడా ఉన్నారా లేదా ఆ సమయంలో మెల్కీసెదెకు మాత్రమే యాజకుడిగా ఉన్నాడా, తద్వారా ఆయన వాస్తవ ప్రధాన యాజకుడయ్యాడా? మెల్కీసెదెకు ఒంటరిగా ఉన్నాడని, ఆ వ్యక్తి అబ్రాము కోసం యహువః తరపున పని చేస్తున్నాడని, అతడు చాలా ప్రత్యేకమైన “నిబంధన” గ్రహీత అవుతాడని సూచించబడెను.

అబ్రామును కలిసే వరకు మెల్కీసెదెకు బైబిల్‌లో కనిపించకపోవడం అబ్బురపరుస్తుంది. ఈ సంఘటనకు ముందు అతడు సజీవంగా మరియు క్రియాత్మకంగా ఉన్నాడని మనం ఊహించవచ్చు, కానీ అతడు ఏమి చేస్తున్నాడో మనకు తెలియదు. యుద్ధంలో కొల్లగొట్టిన వాటిలో పదియవ వంతును సమర్పించే సమయంలో మెల్కీసెదెకు కనిపించినప్పుడు అబ్రాము చూసి ఆశ్చర్యపోయినట్లు ఎటువంటి సూచన లేదు. అది అతడికి చాలా సహజంగా అనిపించింది, ఎలాంటి ప్రశ్నలు అడగలేదు; కాబట్టే అబ్రాము తాను కొల్లగొట్టిన వాటిలో పదియవవంతు తిరిగి ఇచ్చాడు. ఒక సాధారణ వ్యక్తి తన ఆస్తులను పూర్తిగా ఒక అపరిచిత వ్యక్తికి అప్పగించడు కాబట్టి, అబ్రాము మెల్కీసెదెకును యెరిగి యున్నాడని మరియు అతడితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడని ఇక్కడ మనకు తెలియుట లేదా?

ఈ మెల్కీసెదెకు బైబిల్‌లో మూడుసార్లు ప్రస్తావించబడటం ఆసక్తికరంగా ఉంది — ఒకసారి అబ్రాముతో (నిబంధనకు సంబంధించి), మరొకసారి దావీదుతో కీర్తన 110లో (దావీదు మెస్సీయను ముందస్తుగా సూచించు రాజరిక ఒడంబడికను పొందియున్నాడు) మరియు చివరిగా హెబ్రీయులు 6 మరియు 7 లలో (కొత్త నిబంధనకు సంబంధించి). వాస్తవానికి, మొత్తం నిబంధన ఏర్పాటు మెల్కీసెదెకు ద్వారా అబ్రాముకు, దావీదుకు మరియు మెస్సీయ అయిన యహూషువఃకు ముడిపడి ఉంది. కాబట్టి యహూషువఃను రాజుగా మరియు ప్రభువుగా చేయు యహువః వాగ్దానాలు, యహూషువః మెల్కీసెదెకు క్రమము ప్రకారం ఎప్పటికీ యాజకుడు (ప్రధాన యాజకుడు) అవుతాడనే వాగ్దానంతో విడదీయరాని విధంగా ముడిపడియున్నవి. సమస్త దేశాలపై క్రీస్తు రాజ్యం వలె ఇది శాశ్వతమైన యాజకత్వం.

ఈ యాజకత్వానికి భిన్నంగా, అహరోను మరియు అతని వారసుల యాజకత్వానికి ఒక ముగింపు ఉంటుంది. అహరోను సంబంధించిన, లేవీ యాజకత్వం క్రింద ఉన్న ప్రధాన యాజకుడు యహువఃకు సేవ చేశాడు మరియు మతపరమైన విషయాల్లో యహువః దూతగా ప్రజలకు పరిచర్య చేశాడు. ఇది మెల్కీసెదెకు మొదలుకొని సమస్త బైబిల్ యాజకత్వము యొక్క విధి మరియు ఉద్దేశ్యం. ఎందుకు? ఎందుకంటే మానవునితో ప్రత్యక్షంగా వ్యవహరించకూడదనేని యహువః యొక్క నిర్ణయం.

యహువః తనకు మరియు మనిషికి మధ్య మధ్యవర్తిత్వం వహించడు. దీన్ని చేయడానికి ఆయన మానవులను లేదా దూతలను ఎంచుకుంటాడు మరియు క్రైస్తవ క్రమము కింద అతడు ఒక మానవుడు, మహిమాన్వితమైన, అమరత్వం పొందిన యహూషువః క్రీస్తు.

1 తిమోతి 2:5 స్పష్టంగా మరియు నిశ్చయంగా “దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తు యహూషువః అను నరుడు” అని చెబుతోంది. మెల్కీసెదెకు క్రమము ప్రకారం ప్రధాన యాజకునిగా అతని పాత్ర ద్వారా యహూషువః మధ్యవర్తిత్వం నిర్వర్తించబడుతుంది. యహువః తనకు మరియు మనిషికి మధ్య మధ్యవర్తిత్వం వహించడు. ఆయన దీన్ని చేయడానికి మానవులను లేదా దేవదూతలను ఎంచుకుంటాడు మరియు క్రైస్తవ క్రమము కింద ఇది ఒక వ్యక్తి, మహిమాన్వితమైన, అమరత్వం పొందిన యహూషువః క్రీస్తు. (యహూషువః భూమిపై ప్రధాన యాజకునిగా కూడా కనిపించాడు, హెబ్రీ. 9:11.) యహువఃయే యహూషువః మరియు ప్రధాన యాజకుడు అనే ఆలోచన ఏదైనను అది అర్ధవంతం కాదు, ఎందుకంటే "మధ్యలో వెళ్ళు" అని ఒకనిని యహువః నిర్ణయించినట్లయితే, ఏ తర్కం ప్రకారం ఈ మధ్యవర్తి యహువఃయే అని ఎవరైనా చెప్పగలరు? యహువః మధ్యవర్తిత్వం చేస్తున్నట్లయితే, “నాకు మరియు మనిషికి మధ్య నేను మధ్యవర్తిగా ఉంటాను” అని ఎందుకు చెప్పకూడదు?

యహూషువః క్రీస్తును దేవుడు అని పిలిచే విషయంలో సనాతన ధర్మాన్ని సవాలు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. యహువః చనిపోలేడు, యహువః శోధింపబడడు, యహువః నాశనము చేయబడలేడు, యహువః సర్వజ్ఞుడు, ఇప్పుడు మనం మరొకటి చూస్తాము: యహువః ప్రధాన యాజకుడు కాలేడు. యహూషువః ప్రధాన యాజకుడు కాబట్టి యహువః కాలేడు. ఇది తర్కంలో ప్రాథమిక హేతుబద్ధ నిర్ణయం.

హెబ్రీయులు 6-9 అధ్యాయాలలో చెప్పబడిన యాజకత్వం గురించి చెప్పాల్సింది చాలా పెద్ద విషయం ఉంది. నేను కొన్ని ముఖ్యమైన అంశాలను సంగ్రహిస్తాను. లేవీయుల యాజకత్వం అనేది యహువః మరియు ఇశ్రాయేలు మధ్య మధ్యవర్తిత్వం అందించుటకు నియమించబడిన తాత్కాలిక యాజకత్వం. యావత్ మానవాళికి ప్రధాన యాజకునిగా చరిత్రలో యహూషువః రాకతో ఈ విధానం దశలవారీగా నిలిపివేయబడింది. ఆయన పరలోకంలో యహువః కుడి వైపున స్థిరపరచచబడ్డాడు మరియు యహూషువః తిరిగి వచ్చి భూమిపై రాజ్యాన్ని పునరుద్ధరించే వరకు అలాగే ఉంటాడు.

యాజకత్వం యొక్క తోరా మార్చబడింది, ప్రధాన యాజకుడు మార్చబడెను మరియు యాజకత్వం ద్వారా నిర్వహించబడే తోరా మార్చబడింది (హెబ్రీ 7:11-12). యహూషువః యూదా గోత్రం నుండి వచ్చాడని ప్రకటించబడింది, (ఆ గోత్రానికి చెందిన యాజకత్వం గురించి ఎక్కడా మాట్లాడబడలేదు). ఇంకా తోరాలో వివరించబడిన నిబంధనలకు వేరుగా యహూషువః ప్రధాన యాజకుడయ్యాడు. ఎలా? యహువః సంకల్పం ద్వారా, మరియు క్రీస్తు పరిచర్య మరియు పవిత్రమైన బలిపీఠం మీద తన శాశ్వతమైన అర్పణ ద్వారా అతను మెల్కీసెదెకు క్రమం ప్రకారం శాశ్వతంగా యాజకుడయ్యాడు.

తండ్రి అయిన యహువః తనకు మరియు తన కుమారుడైన అంతిమ ప్రధాన యాజకునికి మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టం చేయడానికి కలిగియున్న అవకాశం గురించి మరోసారి ఆలోచించండి. “మన ప్రభువు యూదా గోత్రం నుండి వచ్చాడని స్పష్టమవుతుంది” అని లేఖనం చెబుతోంది — పరలోకం నుండి కాదు, శాశ్వతత్వం నుండి కాదు! మరలా, హెబ్రీయులు 7:15 ఇలా చెబుతోంది, “మెల్కీసెదెకు [ఒక వ్యక్తి, 4వ వచనం] పోలికలో, మరొక యాజకుని లేవనెత్తితే అది మరింత స్పష్టంగా కనిపిస్తుంది.” 24వ వచనంలో యహూషువః మార్పులేని యాజకత్వాన్ని పొందుతాడు. ఎందుకు? అతడు యహువః మరియు ఎల్లప్పుడూ దానిని కలిగి ఉన్నందున కాదు, కానీ అతడు ఏర్పాటు చేయబడిన తర్వాత, ఎప్పటికీ పదవిలో కొనసాగుతాడు. త్యాగం ద్వారా ఈ స్థానాన్ని సాధించాడు.

ప్రాయశ్చిత్తార్థ దినాన పాత నిబంధన క్రింద లేవీ ప్రధాన యాజకుడు చేసినట్లుగా, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించుటకు యహూషువః తనను తాను బలిగా అర్పించవలసి ఉందని హెబ్రీయులు 8లో మనం చదువుతాము. హెబ్రీయులు 8:3 KJV లో “ఇతనికి [యహూషువః] అర్పించుటకు ఏదైనా ఉండాలి” అది అతని ప్రాణం, బలిపీఠం మీద అతని స్వంత రక్తం. ఈ అర్పణ ఫలితంగా "అతడు మరింత శ్రేష్ఠమైన పరిచర్యను పొందాడు, ఎందుకంటే అతడు ఒక మంచి నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు."

యహూషువః ఏకకాలంలో యహువః మరియు ప్రధాన యాజకుడు కాలేడు, మరియు యహూషువః ప్రధాన యాజకుడని స్పష్టంగా ఉన్నందున అతడు యహువః కాలేడు. యాజకులు మానవుల నుండి ఎంపిక చేయబడ్డారు (హెబ్రీ. 5:1).

యహూషువః ఏకకాలంలో యహువః మరియు ప్రధాన యాజకుడు కాలేడు, మరియు యహూషువః ప్రధాన యాజకుడని స్పష్టంగా ఉన్నందున అతడు యహువః కాలేడు. యాజకులు మానవుల నుండి ఎంపిక చేయబడ్డారు (హెబ్రీ. 5:1). లేవీ సంబంధమైన యాజకత్వం తాత్కాలికమైనది మరియు కొత్త మధ్యవర్తిత్వ వ్యవస్థ ద్వారా అది తొలగించబడుతుంది. ఇది మనిషి స్వభావం యొక్క శాశ్వతమైన అవగాహనపై ఆధారపడి ఉంటుంది మరియు నూతన, సహానుభూతిగల, పరిపూర్ణమైన మరియు పునరుత్థానం చేయబడిన వ్యక్తి కరుణామయమైన ప్రధాన యాజకునిగా ఉండవలసిన అవసరం ఉంది. ఇది క్రీస్తు కొరకు యహువః యొక్క ప్రణాళిక. మెస్సీయ "జగదుత్పత్తి మొదలుకొని వధించబడెను" (ప్రకటన 13:8) అనేది యహువః మనస్సులో ఉన్నట్లయితే, మెల్కీసెదెకు శాశ్వతమైన యాజకత్వానికి నమూనా అని యహువఃకు మొదటి నుండీ తెలుసు. లేవీ వ్యవస్థ తాత్కాలికమైనది.

క్రీస్తు యొక్క దైవత్వాన్ని గూర్చి సనాతన విశ్వాసాల యొక్క తరువాతి చట్రంలోకి హెబ్రీయులు 6-9 ను బలవంతంగా లాగకూడదు. యాజకుడు మరియు మధ్యవర్తి యొక్క అతి ముఖ్యమైన పాత్రను నెరవేర్చే వ్యక్తిగా యహూషువః మెస్సీయ తప్ప మరెవరూ కొత్త నిబంధన క్రమంలో ఉన్నట్లు ఎటువంటి సూచన లేదు. లేఖనాన్ని దాని హెబ్రీ మూలం నుండి ప్రవహించేలా మనం అనుమతించినప్పుడు, మనం నిజంగా స్వచ్ఛమైన మరియు జీవ జలాలను త్రాగవచ్చు.

యహూషువః ఏకకాలంలో యహువః మరియు ప్రధాన యాజకుడు కాలేడు, మరియు యహూషువః ప్రధాన యాజకుడని స్పష్టంగా ఉన్నందున అతడు యహువః కాలేడు. యాజకులు మానవుల నుండి ఎంపిక చేయబడ్డారు (హెబ్రీ. 5:1).


ఇది టెర్రీ ఆండర్సన్ రాసిన వ్యాసం. WLC వ్యాసం కాదు.

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.