Print

శ్రమల తరువాత సంఘం ఎత్తబడుటను మేము ఎందుకు విశ్వసిస్తున్నాము

ఇది డబ్ల్యుఎల్‌సి వ్యాసం కాదు. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మా బృందం తీసుకుంటుంది. ఈ అధ్యయనాల రచయితలు చాలా సందర్భాల్లో ముఖ్యమైన ప్రాథమిక బోధనల విషయంలో (7 వ దినపు సబ్బాతు మరియు దేవుడు వంటివి) డబ్ల్యుఎల్‌సి తో చాలా విభేదాలు కలిగి ఉన్నారు. ఏది ఏమయినప్పటికీ, లేఖనాలకు సంపూర్ణంగా సరిపోవుచున్న వారి రచనల ద్వారా ఆశీర్వదింపబడకుండా నిరోధించకూడదు. అయితే, వారి బోధనలలో కొంత భాగాన్ని అంగీకరించుట అనేది వారి సమస్త బోధనలను అంగీకరించినట్లు కాదు.


శ్రమల-తరువాత-సంఘం-ఎత్తబడుటను-మేము ఎందుకు-విశ్వసిస్తున్నాము


శ్రమల తరువాత సంఘం ఎత్తబడుటను మేము ఎందుకు నమ్ముతున్నాము అని చాలా తరచుగా ప్రశ్నించబడుతున్నాము. క్రింద ఉన్న 19 పాయింట్లు మా స్థానాన్ని వివరిస్తాయి.

 1. సంఘం ఎత్తబడుట శ్రమల అనంతరం జరుగునని మత్తయి 24: 29-31 స్పష్టంగా చెబుతుంది. ఈ వాక్యంలోని “ఏర్పరచబడిన/ఎన్నుకోబడినవారు” అనే మాట యూదులకు వర్తిస్తుందని కొందరు చెబుతారు, కాని దీనికి లేఖనాత్మక రుజువు లేదు. ఇంకా, క్రొత్త నిబంధనలోని ఎన్నుకోబడిన లేదా ఎన్నిక అనే పదాన్ని అధ్యయనం చేస్తే, ఈ పదాన్ని ఉపయోగించిన ప్రతిసారీ, అది సంఘాన్ని సూచిస్తుంది, యూదులను కాదు. చాలా పదునైన సంధర్భం రోమా ​​11: 7. మత్తయి 24 లో క్రీస్తు కూడా, ఏర్పరచబడిన (22 మరియు 24 వ వచనాలు) అనే పదాన్ని సంఘాన్ని సూచించడానికి ఉపయోగించెను, అవిశ్వాసులైన యూదా ప్రజలకు కాదు. సంఘం యొక్క ఎత్తుబాటుకి సంబంధించి 31 వ వచనానికి దాని తరువాతి వచనాలు [ఇతర సంఘటనలను తెలియజేయుటతో పాటు] మరింత ఆధారాన్ని ఇస్తాయి. "ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసికొనిపోబడును ఒకడు విడిచి పెట్టబడును. ఇది ఎత్తుబాటు.
 1. 2వ థెస్సలొనీకయులు 2: 1-4 స్పష్టంగా క్రీస్తు విరోధి సంఘం ఎత్తబడుటకు ముందు బయలుపడును అని చెబుతుంది. 6 వ వచనం స్పష్టంగా చెబుతుంది: కాగా వాడు తన సొంతకాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డ గించునది ఏదో అది మీరెరుగుదురు.
 1. మృగం యొక్క ముద్ర కాలంలో - గొప్ప శ్రమల - కాలంలో చంపబడిన పరిశుద్ధులు “మొదటి” పునరుత్థానంలో భాగమవుదురని ప్రకటన 20: 4-6 చెబుతోంది. ఇది శ్రమల ముందు ఎత్తుబాటు సిద్ధాంతంతో విభేదిస్తుంది, ఎందుకంటే అది మృగం యొక్క ముద్రకు ముందు మొదటి పునరుత్థానం జరుగునట్లు సూచిస్తోంది. శ్రమల ముందు ఎత్తుబాటు సిద్ధాంతం ప్రకటన 20: 4-6 లోని పునరుత్థానాన్ని “రెండవ” పునరుత్థానంగా మారుస్తుంది, అయితే ఇది మొదటి పునరుత్థానం అని మనకు చెప్పడానికి యోహాను చాలా ప్రయత్నం చేసెను. గ్రంథ విచ్ఛిన్నతను నివారించే ప్రయత్నంలో, శ్రమలకు పూర్వపు ఎత్తుబాటును బోధించువారు గతంలో, “చాలా మొదటి పునరుత్థానాలు జరిగాయి” అని చెప్పారు. ఇది అసంబద్ధమైనది మరియు పూర్తిగా అనవసరమైనది. అలాగే, ఎత్తుబాటు మరియు పునరుత్థానం ఒకేసారి ఉండవని చెప్పారు. అయితే, క్రీస్తులో చనిపోయినవారు లేచినప్పుడే ఎత్తుబాటు. పునరుత్థానానికి ఇదియే నిర్వచనం.
 1. మత్తయి 13 లోని గోధుమలు మరియు గరుగుల యొక్క ఉపమానం (24-30 మరియు 36-43 వాక్యాలు) చెడు మరియు మంచి పంటకోత ఒకేసారి జరిగే సంఘటనగా వివరిస్తుంది, ఏడు సంవత్సరాల కాలంతో వేరు చేయబడిన రెండు సంఘటనలు కాదు. ఇది ఏడు సంవత్సరాల అంతరాన్ని అనుమతిస్తుంది అని చెప్పేవారు 30 వ వచనాన్ని వివరించలేరు, ఈ వచనం “కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి" అని చెబుతుంది. క్రీస్తు ప్రకారం, గోధుమలు గురుగుల కంటే ముందు కోయబడవు.
 1. 1వ థెస్సలొనీకయులు 4: 15-18 సజీవంగా మరియు ప్రభువు రాకడ వరకు నిలిచియుండు వారి ఎత్తుబాటును గురించి మాట్లాడుతుంది. ఇక్కడ "నిలిచియుండు" అనే గ్రీకు పదం “పెరిలీపో/perileipo”. స్ట్రాంగ్ డిక్షనరీ ప్రకారం, దీనిని “తట్టుకుని జీవించుట” అని కూడా అనువదించవచ్చు. ఇది ఆశ్చర్యం కలిగించదు, ఎందుకంటే “పెరిలీపో” యొక్క మూలంలో “పెరిల్[peril]/ప్రమాదము” అనే పదం ఉంది. నిలిచియుండు అంటే “అపాయాన్ని తట్టుకుని నిలిచి ఉన్నట్లు.” కావున ఇది శ్రమలకు ముందు ఎత్తుబాటు సిద్ధాంతానికి మద్దతు ఇచ్చినట్లు లేదు.
 1. ప్రకటన 13: 7 లో, క్రీస్తు విరోధి సమస్త జనములు, భాషలు మరియు దేశాలను పరిశుద్ధులపై యుద్ధానికి సమకూర్చుతాడు. అది యూదులను మాత్రమే వర్ణించలేదు.
 1. 1వ కొరింథీయులకు 15: 51-54 కడ బూరను గూర్చి మాట్లాడుతుంది. ప్రకటన 11: 15-19 కడ బూరను గూర్చి మాట్లాడుతుంది. ఈ ప్రతి భాగాల వర్ణన ప్రకారం కడ బూర వద్ద జరుగేది ఒకటే.
 1. ఎత్తుబాటు ప్రభువు ఒక దొంగగా వచ్చినప్పుడు జరుగునని ప్రతి ప్రవచన విద్యార్థి అంగీకరిస్తాడు. క్రొత్త నిబంధనలో దీని గురించి చాలా హెచ్చరికలు ఇవ్వబడ్డాయి, వాటిలో మత్తయి 24: 42-43, 1వ థెస్సలొనీకయులు 5: 2, మరియు 2వ పేతురు 3:10. అలాంటి ఒక హెచ్చరిక ప్రకటన 16:16 లో ఇవ్వబడింది. ఇది చివరి, ఆఖరి నిమిషంలో హెచ్చరిక: “ఇదిగో, నేను దొంగవలె వచ్చుచున్నాను.” కానీ సందర్భం గమనించండి. తరువాతి వాక్యం హార్‌ మెగిద్దోను యుద్ధం - 7 వ పాత్ర. దీనికి ఏడు సంవత్సరాల ముందు ఆయన దొంగగా వస్తే, హార్‌ మెగిద్దోను వద్ద తాను దొంగగా వస్తానని యహువః ఎందుకు హెచ్చరిక జారీ చేస్తాడు? సమాధానం, వాస్తవానికి: ఆయన అలా రాడు.
 1. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చుననే మాట రహస్య రాకడను గూర్చి మాట్లాడుతుంది అని సిద్ధాంతీకరించబడింది. అయితే, ఆయన ఎప్పుడు వచ్చునో సంఘానికి తెలుస్తుందని 1వ థెస్సలొనీకయులు 5: 1-8 స్పష్టంగా బోధిస్తుంది. సంఘం ఆశ్చర్యంతో ఎత్తబడదు. రక్షణ పొందనివారు మాత్రమే ఆశ్చర్యానికి గురవుతారు. రహస్య రాకడ సిద్ధాంతం ఎక్కడ ఉద్భవించిందో అర్థం చేసుకోవడం కష్టం.
 1. గొప్ప శ్రమలు అనగా యహువః యొక్క ఉగ్రత అని సాధారణంగా బోధించబడుతుంది. బైబిలు దీనికి విరుద్ధంగా బోధిస్తుంది. గొప్ప శ్రమలు ముగిసినప్పుడు, యహువః ఉగ్రత ప్రారంభమవును. రుజువు: యహువః యొక్క ఉగ్రత సమయంలో జరిగే సంఘటనలలో ఒకటి సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు చీకటిగా మారుట. ఇది 6 వ ముద్రలో వివరించబడింది - ప్రకటన 6: 12-17. ఇది ప్రత్యేకంగా యహువః యొక్క ఉగ్రత అని పిలువబడుతుంది. సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు చీకటిగా మారుటను గూర్చి క్రీస్తు కూడా మత్తయి 24: 29 లో మాట్లాడాడు, క్రీస్తు మాత్రమే మనకు సమయాలను తెలియజేయును. ఇది గొప్ప శ్రమల తరువాత సంభవించునని ఆయన చెప్పారు. క్రీస్తు ప్రకారం, యహువః యొక్క ఉగ్రత గొప్ప శ్రమల కాలం కాదు, బదులుగా, యహువః యొక్క ఉగ్రత గొప్ప శ్రమల తరువాత సంభవిస్తుంది. యహువః యొక్క ఉగ్రతయే శ్రమల కాలం అనే తప్పుడు ఊహలో పనిచేయడం గందరగోళానికి కారణం అవుతుంది.
 1. ప్రకటన 12: 7-17 గొప్ప శ్రమల కాలం యొక్క సంఘటనలను వివరిస్తుంది. మూడున్నర సంవత్సరాల కాలం (1,260 రోజులు, 42 నెలలు, “కాలము, కాలములు మరియు అర్ధ కాలం”) గురించి మాట్లాడే బైబిల్‌లోని అన్ని ఇతర భాగాలతో పోల్చడం ద్వారా దీనిని నిరూపించవచ్చు. 12 వ వచనం గొప్ప శ్రమల సమయాన్ని సాతాను క్రోధము యొక్క సమయం అని పిలుస్తుంది. అన్నిటి తరువాత, యహువః తన ప్రజలను హింసించడు. అయితే, సాతాను అలా చేస్తాడు.
 1. 1 థెస్సలొనీకయులకు 5: 9, యహువః తన ప్రజలను తన ఉగ్రతకు పాలగుటకు నియమించలేదని బోధిస్తుంది. శ్రమల అనంతరం ఎత్తుబాటు బోధన దీనిని అంగీకరిస్తుంది. పైన చెప్పినట్లుగా, గొప్ప శ్రమలు యహువః ఉగ్రత కాదు. ఇది సాతాను క్రోధం. 12 మంది అపొస్తలులలో 11 మంది హతసాక్షులు అని చరిత్రలో నమోదు చేయబడింది. నేటి పరిశుద్ధులు సాతాను యొక్క పరీక్షలు, ప్రలోభాలు మరియు హింసలను ఎదుర్కొనే శక్తిని కలిగి లేరు. తన వధువును వివాహం చేసుకునే ముందు ఆమెను యహువః కొట్టలేడని చెప్పబడింది. అది ఖచ్చితంగా నిజం. కొట్టువాడు ఆయన కాదు. సాతాను.
 1. శ్రమల ముందు ఎత్తుబాటు సిద్ధాంతం ఒక రెండవ రాకడ ఉందని, కానీ అది రెండు దశల్లో జరుగుతుంది అని చెబుతుంది. (మేము ఈ విధానాన్ని సాగదీసినట్లుగా భావిస్తున్నాము.) మొదటి దశ రాకడ తన సంఘం కోసం అని చెప్పబడింది. ఇది రహస్య రాకడ అని కూడా పిలువబడే సంఘ ఎత్తుబాటు. రెండవ దశ మత్తయి 24: 31 లో చెప్పిన యూదుల సమకూర్పు, దీనిని వారు మహిమ ప్రత్యక్షత అని పిలుస్తారు. ఇది చివరి ఏడు సంవత్సరాల ఆఖరులో సంభవిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని విబేధించు కొన్ని లేఖనాలు ఉన్నాయి. ఇక్కడ రెండు ఉన్నాయి: తీతుకు 2: 11-13 రహస్య రాకడ కోసం కాక, మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఈ ప్రస్తుత ప్రపంచంలో నీతితో జీవించాలని సంఘాన్ని నిర్దేశిస్తుంది. 1వ పేతురు 1: 5-7 సంఘానికి రహస్య రాకడ వరకు కాక, మహిమ గల ప్రత్యక్షత వరకు నానా విధములైన పరీక్షలు మరియు శోధనలు కొనసాగుతాయని బోధిస్తుంది.
 1. సంఘ ఎత్తుబాటు సమయాన్ని గూర్చి తెలుసుకోవటానికి, ప్రకటన గ్రంథం ఎలా నిర్మించబడిందో మీరు అర్థం చేసుకోవాలి. శ్రమలకు ముందు ఎత్తుబాటు సిద్ధాంతం ప్రకటన గ్రంథం కాలక్రమానుసారం వ్రాయబడిందనే ఊహపై ఆధారపడి ఉంటుంది. దీనర్థం, ప్రకటన గ్రంథంలో అంత్యకాలం యొక్క సంఘటనలు అవి జరిగే వరుస క్రమంలో నమోదు చేయబడినవని భావించబడుతుంది: మొదట ముద్రలు, తరువాత బూరలు, ఆపై పాత్రలు. అయితే, ప్రకటన గ్రంథం కాలక్రమానుసార వరుసలో వ్రాయబడలేదని నిరూపించగలిగితే, అప్పుడు సందిగ్ధం వీడుతుంది. అయితే, అది నిరూపించబడినది. 7 వ బూర (11వ అధ్యాయం) మరియు 7 వ పాత్ర (16వ అధ్యాయం) ల మధ్యగల ఒక సాధారణ పోలిక అవి ఒకే సంఘటనను వివరిస్తుండెనని తెలియజేస్తుంది. ఈ పోలికకు 6 వ ముద్ర (6 వ అధ్యాయం), యెహెజ్కేలు 38: 18-22, మరియు మత్తయి 24:29 లను జోడించి, ఈ ఐదు భాగాలూ ఒకే సంఘటనను వివరిస్తున్నాయని మేము కనుగొన్నాము. 6 వ ముద్ర, 7 వ బూర మరియు 7 వ పాత్ర 6 వ అధ్యాయంలో, మళ్ళీ 11 వ అధ్యాయంలో మరియు 16 లో వివరించబడిన ఒకే సంఘటన. స్పష్టంగా, ప్రకటన గ్రంథం వరుస క్రమంలో వ్రాయబడలేదు. ప్రకటన గ్రంథం ముందు నుండి వెనుకకు వరుసక్రమంలో లేదని తెలిపే అనేక రుజువులలో ఇది ఒకటి. మరియు ఈ అవగాహనతో, శ్రమలకు ముందు ఎత్తుబాటు సిద్ధాంతానికి ఆధారంగా ఉన్న అంతర్లీన ఊహ కూలిపోతుంది.
 1. క్రీస్తు విరోధి అధికారంలోకి రావాలంటే, పరిశుద్ధాత్మ భూమి నుండి తొలగించబడాలని సాధారణంగా అంగీకరించబడుతుంది. ఈ తీర్మానానికి ఆధారం 2వ థెస్సలొనీకయులు 2: 7. అయితే ఈ సిద్ధాంతంతో కొన్ని సమస్యలు ఉన్నాయి. మొట్టమొదట, ఇదే అధ్యాయంలోని మొదటి 4 వాక్యాలు మేము ఇప్పటికే పైన చూపించినట్లుగా, సంఘ ఎత్తుబాటుకు ముందు క్రీస్తు విరోధి యొక్క ప్రత్యక్షతను తప్పనిసరి చేస్తుండెను. అక్కడ మూడు వాక్యాల తరువాత పౌలు తన స్థానాన్ని వెంటనే మార్చివేయలేదు. రెండవది, 7 వ వచనంలోని “అతడు” పరిశుద్ధాత్మ అని భావించబడుతుంది, కాని దీనికి ఎటువంటి రుజువు లేదు. చివరకు, గొప్ప శ్రమల కాలంలో భూమిపై పరిశుద్ధాత్మ లేకపోతే, ఇద్దరు సాక్షులు వారి అద్భుతాలన్నింటినీ చేయడానికి ఏ శక్తిని ఉపయోగిస్తారు. ప్రకటన 13: 5-7 మరియు ఇతర భాగాలలో శ్రమల సమయంలో భూమిపై ఉన్న ప్రజలు తిరిగి జన్మించిన వారు అని తెలియజేస్తుండెను. పరిశుద్ధాత్మ లేకుండా ఒక వ్యక్తి తిరిగి ఎలా జన్మించగలడు? శ్రమలకు ముందు ఎత్తుబాటు సిద్ధాంతం ప్రకారం, విడువబడిన వారికి మోక్షానికి రెండవ అవకాశం ఉంటుంది. పది మంది కన్యల యొక్క ఉపమానం ప్రకారం (మత్తయి 25: 1-13) ఆయన ఒకేసారి వస్తాడు మరియు రెండవ మారు ఎత్తుబాటుకు అవకాశం లేదు.
 1. కొందరు శ్రమల మధ్య ఎత్తుబాటును బోధించారు. ఏదేమైనా, శ్రమల కాలం ఏడు సంవత్సరాల పాటు ఉంటుందని ఊహిస్తున్నందున ఈ స్థానం అసాధ్యం. అయినప్పటికీ, మొత్తం బైబిల్లో ఏడు సంవత్సరాల శ్రమలను వివరించే ఒక్క లేఖనం కూడా లేదు. బైబిలులో గల శ్రమలను గూర్చిన ప్రతి వర్ణన అది మూడున్నర సంవత్సరాలు ఉంటుందని బోధిస్తుంది. దానియేలు 7:25, 12: 1-7, ప్రకటన 11: 3-12, 12: 6, 12: 7-12, 12: 13-17, మరియు 13: 5-7. ఏడు సంవత్సరాల శ్రమలను గూర్చిన అపార్థం దానియేలు 9:27 నుండి వచ్చింది, ఇది ఏడు సంవత్సరాల కాలంలో స్థిరపరచబడిన నిబంధనను గూర్చి మాట్లాడుతుంది. ఈ వాక్యం ఏడు సంవత్సరాల కాలం మధ్యలో నాశనకరమైన హేయ వస్తువు నిలుపబడుట జరుగునని బోధిస్తుంది. నాశనకరమైన హేయ వస్తువు గొప్ప శ్రమల కాలానికి ప్రారంభం అని క్రీస్తు చెప్పాడు (మత్తయి 24: 15-21). గొప్ప శ్రమలు మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఉంటాయని దీని నుండి మనకు తెలుస్తుంది.
 1. ఎత్తబడుట ప్రకటన 4: 1 లో వివరించబడిందని చాలామంది బోధించారు. "ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసినవాటిని నీకు కనుపరచెదననెను" అని యోహానుకు చెప్పబడెను. ఈ వాక్యానికి ఎత్తుబాటుతో సంబంధం లేదు. ఇక్కడ చెప్పిన దానికి అర్థం: "ఇకమీదట జరుగవలసిన విషయాలను నేను నీకు చూపించెదను." ఇది యోహాను భవిష్యత్ సంఘటనలను వ్రాయుటకు ప్రారంభించినప్పటి సంధర్భం. ప్రకటన 1: 19 లో, మూడు విషయాలు వ్రాయాలని యోహానుకు చెప్పబడింది: “నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని వ్రాయుము.” 1-3 అధ్యాయాలలో “… అతడు చూసినవి, ఉన్నవి” వ్రాసాడు. 4వ అధ్యాయం 1 వ వచనం “… ఇకమీదట జరుగవలసిన విషయాలు” లోకి దారి తీస్తుంది.
 1. శ్రమలకు ముందు ఎత్తుబాటు సిద్ధాంతానికి రుజువుగా ప్రకటన 3:10 ని కొందరు ఉదహరించారు. వాక్యం ఇలా చెబుతోంది: "నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో (మూలభాషలో-శోధనగడియలో) నేనును నిన్ను కాపాడెదను." ప్రపంచంపై రాబోవు శోధనల నుండి ఫిలదెల్ఫియా సంఘాన్ని యహువః రక్షించినట్లు, గొప్ప శ్రమల నుండి ఆయన మనలను రక్షిస్తాడు అని కొందరు వాదించారు. ఈ భాగం కేవలం ఫిలదెల్ఫియా సంఘానికి ఒక సందేశం, యోహాను పత్మాసు ద్వీపం నుండి నుండి విడుదలయ్యాక దీనిపై పర్యవేక్షణ కలిగియుండెను. ప్రకటన 2: 10 లో స్ముర్న సంఘానికి ఈ క్రింది సందేశం వ్రాయబడింది: “… మీరు శోధింపబడునట్లు అపవాది (అనగా-సాతాను) మీలో కొందరిని చెరలో వేయింప బోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; … ” దీని అర్థం గొప్ప శ్రమల కాలం పది రోజులు మాత్రమే ఉంటుందని అర్థమా? అస్సలు కానే కాదు. మళ్ళీ, ఇది ఆసియాలో ఉన్న ఏడు సంఘాలలో ఒకదానికి ఒక సందేశం, యోహాను పరవాసము నుండి విడుదలైన తరువాత వాటిని పర్యవేక్షిస్తాడు.
 1. మత్తయి 24:37, “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును” అనే వాక్యాన్ని కొందరు శ్రమలకు పూర్వపు సంఘ ఎత్తుబాటుకు రుజువుగా చూపించారు. జలప్రళయం యొక్క గొప్ప శ్రమల నుండి తప్పించుకోవడానికి యహువః తాను ఎన్నుకున్న వారికి సహాయం చేశాడని వివరిస్తూ, అదేవిధంగా రాబోయే శ్రమల నుండి తన సంఘాన్ని ఎత్తుబాటు చేస్తాడని చెప్పిరి. ఏదేమైనా, యహువః నోవహును జలప్రళయం నుండి మాత్రమే రక్షించాడని గమనించాలి. జలప్రళయం నుండి తప్పించుటకు ఆయన నోవహును పరలోకానికి తీసుకురాలేదు. ఇంకా, నోవహు దినాలతో పోల్చిన మనుష్యకుమారుని రాకడ 29-31 వచనాలలో వివరించబడినది, ఇది శ్రమలు ముగిసిన వెంటనే జరుగునని వాక్యం ప్రత్యేకంగా చెబుతుంది.

ఇది డబ్ల్యుఎల్‌సి కథనం కాదు. https://www.endtime.com/blog/why-we-believe-in-a-post-tribulation-rapture/. నుండి తీసుకోబడినది.

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి మరియు కుమారుని శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృదం.