ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము. |
నేను ఈ అధ్యయనాన్ని కొంత లోతైనదనే హెచ్చరికతో ప్రారంభిస్తాను. ఈ అధ్యయనానికి నిర్దిష్ట స్థాయి ఏకాగ్రత అవసరం. దీన్ని చదివే ముందు దయచేసి ప్రార్థించండి. యహువఃయే మనందరికీ మార్గనిర్దేశం చేస్తాడు! (యహువః అనేది మన పరలోకపు తండ్రి పేరు.)
“మీరు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నారా?” అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ నేను అడగాలనుకుంటున్నాను.
లేఖనం ప్రకారం, మీరు ‘ధర్మశాస్త్రము క్రింద’ ఉన్నట్లయితే… అప్పుడు:
- ధర్మశాస్త్రము మీ కోసమే వ్రాయబడింది.
- పాపం మీపై ఆధిపత్యం చెలాయిస్తోంది.
- మీరు విశ్వాసం లేకుండా ఉన్నారు.
- మీకు విముక్తి అవసరం.
ఈ అధ్యయనం లోతైనది అయినప్పటికీ, దాని ప్రాముఖ్యతను మనం తక్కువగా అంచనా వేయలేము. ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారు చాలా సమస్యలలో ఉన్నారు! వారికి మోక్షం లేదు!
కానీ నేను ఇక్కడ చెప్పిన ఈ 4 లక్షణాల గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అవి ధర్మశాస్త్రానికి విధేయత చూపే వ్యక్తి గురించి మాట్లాడట్లేదు.
బదులుగా, ‘ధర్మశాస్త్రానికి లోబడి’ ఉన్నవారు విశ్వాసం లేని వారని, రక్షింపబడని వారని, పశ్చాత్తాపపడని వారని, పాపం వారిపై పరిపాలన చేస్తుందని సూచిస్తున్నాయి.
ఇప్పుడు ప్రశ్నలోని లేఖనాలను పరిశీలిద్దాం:
రోమా 3:19– ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము యహువః శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదుము.
ఈ వచనం ‘ధర్మశాస్త్రము క్రింద’ ఉన్నవారి గురించి మాట్లాడుతుంది. ‘ధర్మశాస్త్రము మాట్లాడుతున్నది ఈ వ్యక్తుల సమూహంతో. అనగా "‘ధర్మశాస్త్రం ఏది చెప్పినా అది వారికే చెబుతుంది"
ఈ వ్యక్తుల సమూహం యొక్క ఒక లక్షణం ఏమిటంటే, ధర్మశాస్త్రం వారితో మాట్లాడుతునప్పుడు, "ప్రతి నోరు మూయబడుతుంది, మరియు లోకమంతా యహువః ఎదుట దోషిగా నిలబడుతుంది."
ఇది యహువః ధర్మశాస్త్రానికి విధేయత చూపుతున్న వారి గురించి మాట్లాడుతుందా?
పూర్తిగా అసాధ్యం! ఈ గుంపు ప్రజలు యహువః ధర్మశాస్త్రానికి లోబడి నడుచుకుంటూ ఉంటే, అది వారికి చదివి వినిపించినప్పుడు వారి నోర్లు ఎందుకు మూయబడి, యహువః ఎదుట దోషులుగా ప్రకటించబడతారు?
వాస్తవానికి, ఇది అర్ధవంతం కాదు. నిజానికి, ఇది దానికి పూర్తి విరుద్ధంగా చెబుతోంది. ‘ధర్మశాస్త్రం కింద’ ఉన్నవారు ధర్మశాస్త్రానికి లోబడని వారు అని చెప్పవలసి ఉంటుంది… కాబట్టి వారి నోరు మూసివేయబడెనని మరియు వారు యహువః ఎదుట దోషులని చెప్పబడెను.
ఈ వచనాన్ని చూద్దాం:
రోమా 3:19– ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము యహువః శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదుము.
‘లోకమంతా’ యహువః ముందు దోషి అని ఇక్కడ చెబుతోంది. దీనర్థం ఈ ప్రపంచం మొత్తంలో ఆయన ధర్మశాస్త్రాన్ని విన్న ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాడని లేదా ధర్మశాస్త్రం కింద ఉన్నాడని అర్థమా? తప్పకుండా!
కానీ ఎందుకు?
సమాధానం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ, యూదులైనా లేదా అన్యులైనా, వారి జీవితంలో ఏదో ఒక సమయంలో పాపం చేశారు.
1 యోహాను 1:8- మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు.
కాబట్టి ‘ధర్మశాస్త్రానికి లోబడి’ ఉన్నవారు పాపం చేసిన వారేనని ఇప్పుడు ఇది సంపూర్ణంగా అర్థవంతంగా ఉంటుంది. వారు “యహువః ఎదుట దోషులు”.
ఇప్పుడు తదుపరి వచనాన్ని చూద్దాం:
రోమీయులకు 3:20 – ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు;
ఈ వచనం ద్వారా ఈ అంశం మరింత ముందుకు సాగుతుంది. ఇక్కడ ముఖ్యమైన పదం "నీతిమంతుడు". "ధర్మశాస్త్రం యొక్క క్రియల ద్వారా ("ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా" అని అనువదించబడింది), ఏ వ్యక్తి నీతిమంతుడు కాదు." ఇది ఎందుకు?
సమాధానం మునుపటి వచనంలో ఉంది. ధర్మశాస్త్రం కారణంగా “ప్రపంచమంతా” యహువః ఎదుట దోషిగా ఉంది. మనం దానిని పాటించనప్పుడు ధర్మశాస్త్రం మనల్ని నీతిమంతులుగా చేయదు. పాపం అంటే ఏమిటో ధర్మశాస్త్రం మాత్రమే చెబుతుంది! పౌలు కూడా "ధర్మశాస్త్రము వలననే పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది" అని చెప్పాడు!
ఇంకా చదువుదాం:
రోమా 3:20- ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. 21- ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా యహూవః నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.
ధర్మశాస్త్రంలో మరియు ప్రవక్తల గ్రంథాలలో మనుష్యులకు ఇవ్వవలసిన ఒక నిర్దిష్ట నీతి ఉంది. అయితే, ఈ నీతి ధర్మశాస్త్రం నుండి కలిగేది కాదని ప్రవక్తలలో వ్రాయబడింది.
ఈ నీతి యహువః నుండే రాబోతుంది:
యిర్మీయా 23:5- యహువః ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు; రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యహువః మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.
ఇది యహూషువః (సాధారణంగా "యేసు" అని పిలుస్తారు) మెస్సీయాను గురించిన ప్రవచనం. ఆయనను "Yahuwah tzidkenu/యహువః ట్జిడ్కెను" (యహువః మన నీతి) అని ఎందుకు పిలుస్తారు?
యెషయా 45:23, 24– నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు. యహువః యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయన యొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు.
మెస్సీయ అయిన యహూషువః ద్వారా మాత్రమే మనం నీతిని మరియు బలాన్ని పొందగలము.
యహూషువః మన పాపాల కొరకు మరణించి, మన పాపాలకు శిక్షను చెల్లించినందున మనం నిత్యజీవాన్ని పొందగలము! మనం ఎందుకు నిత్యజీవాన్ని పొందగలం? ఎందుకంటే ఆయనను మనం అంగీకరించినప్పుడు, యహువః చూసేది మన నీతిని కాదు... మెస్సీయ అయిన యహూషువః నీతి మనల్ని శుభ్రపరుస్తుంది!
గలతీయులకు 2:20- “నేను మెస్సీయాతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, మెస్సీయాయే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన యహువః కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.
కాబట్టి ఇందులో, మెస్సీయ అయిన యహూషువః ద్వారా యహువః మన నీతి అయ్యాడు. నిజానికి, దీన్ని తదుపరి వచనం ప్రకటిస్తుంది…ఇప్పుడు సందర్భోచితంగా: రోమా 3:21 – ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.
22.అది యహూషువః మెస్సీయనందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు యహువః నీతియైయున్నది. 23.ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి యహువః అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.
ఇక్కడ నిజమైన అర్థం ఏమిటో ఈ వచనాలు చక్కగా వివరిస్తాయి. మనల్ని కాపాడుతున్నది మన ధర్మం (ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించడం) కాదు. మన ధర్మం (ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించడం) మనల్ని నీతిమంతులుగా చేయదు.
విశ్వాసం ద్వారా... మనల్ని రక్షించటం, నీతిమంతులుగా మార్చటం మరియు మనల్ని తన కుమారులు మరియు కుమార్తెలుగా మార్చబడటం కోసం మనం ఆధారపడవలసినది ఆయన నీతి పైనే! మీలో కొందరు ఇది కేవలం పౌలిన్/పౌలు సిద్ధాంతంగా భావించి ఉండవచ్చు...కానీ అది నిజం కాదు! ఇది ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల నుండి నేరుగా ఉంది.
యెషయా 54:17 - నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు; న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు యహువః యొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యహువః వాక్కు.
కేఫా (పేతురు) కి కూడా ఈ సిద్ధాంతం తెలుసు:
2 పేతురు 1:1 - యహూషువః మెస్సీయ దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు, మన యహువః యొక్కయు రక్షకుడైన యహూషువః మెస్సీయ యొక్కయు నీతినిబట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది.
కాబట్టి ‘ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడరు’ అనే సిద్ధాంతం పౌలు ఆలోచన అని మరియు ఇంతకు ముందు వినబడలేదని ఒక్క క్షణం కూడా అనుకోకండి. ఈ సిద్ధాంతం "పాత నిబంధన" అని పిలువబడే దానిలో కూడా స్పష్టంగా చెప్పబడింది. ఇప్పుడు 'ధర్మశాస్త్రం క్రింద' ఉన్నవారితో వ్యవహరించే ఇతర లేఖనాలకు వెళ్దాం.
రోమీయులకు 6:12 - కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.
పౌలు రోమీయులకు తమ "చావునకు లోనైన శరీరంలో" పాపాన్ని ఏలనివ్వకూడదని చెబుతున్నాడు. అవును, మనం ఈ సమయంలో మన జీవితంలో చావునకు లోనైనవారము. మనం ఇకపై చావులేని వారిగా ఉండే సమయం వస్తుంది... మనం మృతులలో నుండి లేచినప్పుడు అమరత్వం పొందుతాము... ఆ సమయంలో మనం పూర్తిగా పాపరహితులమై ఉంటాము... కానీ మనం ఇప్పుడు ఆ మార్గంలో జీవించాలి!
తదుపరి వచనం:
రోమీయులకు 6:13 - మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా( లేక ఆయుధములుగా) పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే యహువఃకు అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా యహువఃకు అప్పగించుడి.
మనల్ని మనం ఒక సజీవునిగా, మృతులలోనుండి లేచినవారిగా సజీవంగా యహువఃకు అప్పగించాలి మరియు మన అవయవాలు ధర్మానికి సాధనాలుగా ఉండనివ్వాలి...అన్యాయానికి కాదు.
తదుపరి వచనం:
రోమీయులకు 6:14 - మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.
పాపం మనపై ఆధిపత్యం కలిగి ఉండదని వాగ్దానం చేయబడింది, ఎందుకంటే మనం ధర్మశాస్త్రానికి లోబడి లేము, కానీ కృప/అభిమానం కింద ఉన్నాము! దీని అర్థం ఏమిటి?
మనము చర్చించిన రోమీయులలోని ఇతర లేఖనం ప్రకారం, ధర్మశాస్త్రానికి లోబడి ఉండటం అనగా ఆ అంత్య దినాన నీతిమంతులుగా తీర్చబడుటకు వారి స్వంత నీతి/ధర్మశాస్త్రాన్ని పాటించడంపై ఆధారపడేవారిని సూచిస్తుంది... వారు తమ పాపాల విషయంలో దోషులుగా నిర్ధారించబడతారు.
అయితే మెస్సీయ అయిన యహూషువః ద్వారా యహువః నీతిని అంగీకరించిన వారు ‘కృప/దయలో ఉన్నారు’!
వారు ఇప్పుడు వారి పాపాలకు క్షమాపణ పొందారు మరియు తాము నీతిమంతులుగా తీర్చబడుటకు యహూషువః నీతిపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం తిరిగి వెళ్లి ఉద్దేశపూర్వకంగా ఆ ధర్మాన్ని మరోసారి ఉల్లంఘించగలమా?
రోమా 6:15- అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదమా? అదెన్నటికిని కూడదు.
మనం ఇంతకు ముందు గడిపిన జీవితంలోకి మళ్లీ ఎందుకు వెళ్తాము? పాపం చేసాము! ఆయన ధర్మాన్ని అతిక్రమించటమే పాపం!
1 యోహాను 3:4- పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.
మనము పాపం చేసాము, అందుకే యహూషువః మొదట మనకోసం మరణించవలసివచ్చెను! పౌలు చెప్పినట్టుగా "యహువః నిషేధించెను!" లేదా మరింత ఖచ్చితంగా "అట్లనరాదు!” అని అనువదించబడినది.
రోమా 6: 16- లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా?
కాబట్టి మనం ‘మరణము కోసం పాపానికి దాసులుగా ఉందామా లేక నీతికి విధేయులుగా నడుచుకుంటూ యహూవఃకి దాసులుగా ఉందామా?
మనం ‘కృపలో ఉన్నాము’ కాబట్టి యహువః ధర్మశాస్త్రానికి అవిధేయత చూపాలనే ఆలోచన దురదృష్టవశాత్తూ నేడు మెస్సీయను విశ్వసించేవారిలో ఒక సాధారణ సిద్ధాంతంగా మారిపోయింది. అది అలా ఉండకూడదు!
ఈ సిద్ధాంతాన్ని విశ్వసించేవారిలో బాగా ప్రాచుర్యం పొందిన ఒక లేఖనాన్ని ఇప్పుడు చూద్దాం:
గలతీయులకు 3:21- ధర్మశాస్త్రము యహువః వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడియున్నయెడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును.
గలతీయులకు 3 సందర్భంలో, ధర్మశాస్త్రం యహువః వాగ్దానాలకు వ్యతిరేకం కాదు (ఆ వాగ్దానం ఏమిటంటే, అబ్రహాము యొక్క కుమారుడు… యహూషువః మెస్సీయ ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాము మరియు ఆశీర్వదించబడతాము). మనం ఆయన ధర్మాన్ని ఉల్లంఘించి దానిని పాటించడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడలేము.
మనకు యహువః నీతి కావాలి!
గలతీయులకు 3:22- యహూషువః మెస్సీయనందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించువారికి అనుగ్రహింపబడునట్లు, లేఖనము అందరిని పాపములో బంధించెను.
మనమందరం ‘ధర్మశాస్త్రము కింద’ మరియు ‘పాపం కింద’ ఉన్నాము.
గలతీయులకు 3:23,24- విశ్వాసము వెల్లడికాకమునుపు, ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమవలంబింపవలసినవారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైనవారమైతిమి.
24.కాబట్టి మనము విశ్వాసమూలమున నీతి మంతులమని తీర్చబడునట్లు మెస్సీయ నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను.
ఇందులో, ధర్మశాస్త్రం మన బోధకుడు లేదా బాలశిక్షకుడు....మనలను పాపం నుండి కాపాడుటకు. కానీ అది మన వైఫల్యాలలో మనం పాపులమని కూడా బోధిస్తోంది! యహూషువఃపై విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నీతి పొందుట తప్ప మనకు వేరే మార్గం లేదని అది మనకు నేర్పింది. మనకు మధ్యవర్తిగా ఉండడానికి నీతిమంతుడు మరియు పవిత్ర శక్తిమంతుడు కావాలి!
గలతీయులకు 3:25- అయితే విశ్వాసము వెల్లడియాయెను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము.
ధర్మశాస్త్రం మన బోధకుడు, మనము "ధర్మశాస్త్రం క్రింద" ఉన్నాము. కానీ ఇప్పుడు మనం మెస్సీయ అయిన యహూషువఃపై విశ్వాసం ఉంచాము, "యహువః మా నీతి" అని పిలువబడే వ్యక్తిని విశ్వసించి, ఆయన రక్తం ద్వారా శుద్ధి చేయబడి, పవిత్రం చేయబడి మరియు విమోచించబడ్డాము... మనం ఇకపై 'ధర్మశాస్త్రానికి లోబడి' లేము!
మనం ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారమైతే, మనం ఎప్పుడూ పాపం చేయకుండుట మాత్రమే మనం రక్షింపబడే ఏకైక మార్గం.
‘ఎప్పుడూ పాపం చేయని’ వాడు ఒక్కడే ఉన్నాడు. అతను ధర్మశాస్త్రం కింద జన్మించాడు ... అయినను పాపం లేకుండా ఉన్నాడు.
గలతీయులకు 4:4- అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు యహువః తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి, 5- మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.
మెస్సీయ అయిన యహూషువః యొక్క నీతి ద్వారా మనం యహువః దత్తపుత్రులం! మనం పరిపూర్ణమైన మరియు పాపరహితమైన జీవితాన్ని గడపడం నుండి రక్షింపబడ్డాము.. కాబట్టి, మళ్ళీ మన రక్షణ మన స్వంత నీతి/ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కలుగదు...కానీ ఆయన నీతి ద్వారా మాత్రమే కలుగుతుంది.
గలతీయులకు 5:18- మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు.
ఇప్పుడు మనం ఈ వచనం ప్రకారం చాలా మంది తీసుకోవడానికి ఇష్టపడతున్నట్లుగా ఆ తీర్మానాన్ని తీసుకుంటే, "మనం ఆత్మచేత నడిపించబడినట్లయితే, మనం యహూవః చట్టానికి విధేయత చూపవలసిన అవసరం లేదు" అని చెప్పాలి. కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పటివరకు మనం పరిశీలించిన ప్రతి వచనం దానికి విరుద్ధంగా ఉంది.
వాస్తవం ఏమిటంటే, అవిధేయులు మరియు మెస్సీయకు దూరంగా ఉన్నవారు అతని ధర్మశాస్త్రం క్రింద ఉన్నారని మేము కనుగొన్నాము.
నిజానికి ఈ గలతీయులు 5లోని ఈ క్రింది వచనాలు కూడా ఆత్మలో నడుచుకునే వ్యక్తి అవిధేయుడిగా ఉండలేడని రుజువు చేస్తున్నాయి!
గలతీయులకు 5:18- మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు. 19.శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, 20.విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, 21.భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు యహువః రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. 22.అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. 23.ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.
శరీర క్రియలు యహువః ధర్మశాస్త్రానికి అవిధేయములు. ఆత్మ ఫలాలు ఆయన ధర్మశాస్త్రమునకు విధేయత…ఎంత స్పష్టం! మనం ‘ధర్మశాస్త్రము కింద’ లేము అని చెప్పుట, దానిని ఉల్లంఘించే స్వేచ్ఛ మనకు ఉందని అర్థం కాదు!
నిజానికి, ఇది కేవలం వ్యతిరేక అర్థం! కాబట్టి ‘ధర్మశాస్త్రము కింద’ ఉన్న ఈ వ్యక్తుల సమూహం ఎవరు?
పౌలు కాలంలో, మెస్సీయ అయిన యహూషువఃను అంగీకరించుట ద్వారా యహువఃను తమ నీతిగా ఉండనివ్వడానికి బదులు రక్షణ కొరకు తమ సొంత నీతిపై నమ్మకం ఉంచిన యూదులు.
అయితే నేడు కూడా, యహూషువఃను కలిగి లేనివారు లేదా మెస్సీయను అంగీకరించిన తర్వాత ఉద్దేశపూర్వకంగా పాపం చేయుటను/ఆయన ధర్మాన్ని ఉల్లంఘించడాన్ని ఎంచుకున్న వారు ఉన్నారు. వారు తమను తాము తిరిగి ధర్మశాస్త్రం క్రింద ఉంచుతున్నారు!
మీకు కూడా ఇదే నేర్పించబడితే, ఈ రోజు నేను మీకు హెచ్చరిస్తున్నాను, మీకు తీవ్రమైన తప్పు బోధించబడింది!
యహువః ధర్మశాస్త్రం 2000 సంవత్సరాలుగా దూషించబడింది మరియు విస్మరించబడింది. మనుష్యులందరూ జీవించే ప్రమాణంగా మనం దానిని ఎత్తవలసిన సమయం ఆసన్నమైంది. యహువః యొక్క నీతి ద్వారా మనం నీతిమంతులుగా నిర్ధారించబడిన తర్వాత, మనం మళ్లీ ఆ పాత పాపానికి తిరిగి వెళ్లకూడదని ప్రజలందరికీ తెలియజేయాలి.
మనం "ధర్మశాస్త్రం క్రింద" ఉండకపోవచ్చు, కానీ మనం కూడా "ధర్మశాస్త్రానికంటే గొప్పగా" ఉన్నట్లుగా జీవించాలని దీని అర్థం కాదు!
యహువః ప్రమాణాన్ని తీసివేయలేదు, ఆ ప్రమాణానికి అనుగుణంగా జీవించనందుకు ఆయన మనల్ని క్షమించాడు.
యహువఃను మన నీతిగా కలిగి ఉండాలంటే...నిజంగా ప్రపంచంలో అంతకంటే గొప్ప ఆశీర్వాదం లేదు! ఆ ప్రమాణానికి అనుగుణంగా జీవించడంలో విఫలమైనందుకు మీరు క్షమించబడేందుకు యహూషువః మీ కోసం మరణించారు.
మనం తిరిగి వచ్చి కృప యొక్క ఆత్మను అవమానించవద్ధు… అయితే మనం కొత్త జీవితాన్ని జీవిద్దాం... ఆయన విధేయతలో నడుచుకుంటూ.. ఆయన దయలో నడుస్తూ... ఆయన ఆత్మలో నడుచుకుందాం!
ఇది టామ్ మార్టిన్సిక్ రాసిన WLC కాని వ్యాసం.
మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్సి బృందం.