శేష వేదాంతం| సంఘము మరియు ఇశ్రాయేలు పై విభిన్న దృక్పథం
చారిత్రాత్మకంగా, ఇశ్రాయేలుతో సంఘానికి ఉన్న సంబంధానికి సంబంధించి రెండు ప్రధాన సిద్ధాంతాలు ఉనికిలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ వేదాంతంలో, ఇశ్రాయేలు స్థానాన్ని సంఘం భర్తీ చేస్తుంది, కావున ఇశ్రాయేలుకు విమోచన భవిష్యత్తు ఉండదు. విభజన వేదాంతంలో (దైవసంకల్పం యొక్క ఒక అంశం), యహువః సంకల్పంలో 1 ఇశ్రాయేలుకు భవిష్యత్తు ఉండుటవలన, ఇశ్రాయేలుకు మరియు సంఘానికి మధ్య వ్యత్యాసం ఉంటూ, ఇది అన్ని కాలాలలో కాపాడబడి, రెండూ ఎన్నడూ దేనికది వేరుగా ఉన్నవి.
ఈ రెండు ప్రజాదరణ పొందిన దృక్పథాలు తప్పుగా ఉన్నాయా? ఈ రెండిటికి మధ్యస్థ సత్యం ఉందా?
సరైన మరియు సరికాని వ్యత్యాసాలు
సంఘము మరియు ఇశ్రాయేలు గూర్చిన చర్చలో గ్రహించవలసిన మొదటి విషయం ఏమిటంటే, బైబిలు అరుదుగా జాతీయ ఇశ్రాయేలుకి మరియు సంఘానికి మధ్య సమాంతర వ్యత్యాసాన్ని చూపిస్తుంది (మత్తయి 23:39 మరియు రోమా 11:26 సాధ్యమైన మినహాయింపులు). బైబిలు ప్రకారం, ఇశ్రాయేలు ఒక దేశం, ఆత్మీయ అస్తిత్వం కాదు. ప్రజా దేశంగా (ఇతర దేశాల ప్రజల మాదిరిగానే), ఇది రక్షింపబడిన మరియు రక్షింపబడని రెండు వర్గాలనూ కలిగి ఉంటుంది. బైబిలు ఇశ్రాయేలును ఒక ఆత్మీయ అస్తిత్వం (రక్షింపబడిన ఇశ్రాయేలు) గా మాట్లాడినప్పుడు, అది శేషించిన ఇశ్రాయేలును సూచిస్తుంది (ఇది "శేషించిన ఇశ్రాయేలుకు మరియు సంఘానికి మధ్య వ్యత్యాసం ఉందా?" అని అడుగుటకు మనలను బలవంతం చేస్తుంది) - ఈ ప్రశ్నను మనం పరిష్కరించుకుంటాము. త్వరలో.
యూదులకైనను, గ్రీసుదేశస్థులకైనను, ఎలోహీం సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోష పెట్టుచున్నాను. (1 మొదటి కొరింథీయులకు 10:32-33)
ఈ ప్రకరణం ఇశ్రాయేలుకు మరియు సంఘానికి మధ్య గల సమాంతర వ్యత్యాసాన్ని సమర్థించుటకు తరచుగా ఉపయోగించబడుతుంది, కాని ఈ ప్రకరణం అలా చెప్పుటలేదు. "యూదులు" రక్షణ పొందని యూదులను, "గ్రీకులు" రక్షణ పొందని గ్రీకులను, మరియు "యహువః సంఘము" రక్షణ పొందిన (యూదులు మరియు గ్రీకులను) సూచిస్తుందని తక్షణ సందర్భం చూపిస్తుంది. అందువల్ల, ఈ భాగం మిగిలిన బైబిలుకు అనుగుణంగా ఉంటూ, దీనిలో (1) యూదులు మరియు అన్యజనుల మధ్య, మరియు (2) రక్షింపబడిన మరియు రక్షింపబడని వారి మధ్య సమాంతర వ్యత్యాసాన్ని సూచిస్తుంది. మిగతా లేఖనాలకు కూడా సరిపోవుచూ, ఇది జాతీయ ఇశ్రాయేలుకు మరియు సంఘానికి మధ్య సమాంతర వ్యత్యాసాన్ని/ఒక వర్గ లోపాన్నిచూపదు.
మరి ప్రజలు ఎందుకు జాతీయ ఇశ్రాయేలును సంఘముతో భర్తీ చేయాలనుకుంటున్నారు లేదా ఇశ్రాయేలును మరియు సంఘాన్ని వేరు చేయాలనుకుంటున్నారు? ఈ సమస్య మూడు భాగాలుగా ఉంది. మొదటిది, యూదులు మరియు అన్యజనులు ఇద్దరితో సంఘము నిర్మాణమైనప్పటికీ, ప్రజలు సాధారణంగా "సంఘము" అనగా అన్యజనులు మాత్రమే అని చెప్పుదురు (ఎఫెసీయులు 3: 6). రెండవ సమస్య ఏమిటంటే ప్రజలు తరచుగా "ఇశ్రాయేలు" అనగా యూదులు మాత్రమే అని చెప్పుదురు. ఇది కూడా లేఖనాలకు విరుద్ధం. అన్యులలోని విశ్వాసులు ఇశ్రాయేలీయులుగా ఎంచబడుదురు (ఎఫెసీయులు 2:12, 19). మూడవ సమస్య ఏమిటంటే, ప్రజలు సాధారణంగా జాతీయ ఇశ్రాయేలుకు మరియు శేష ఇశ్రాయేలుకు మధ్య తప్పనిసరి వ్యత్యాసాన్ని చూపించరు, బైబిలు ఆ వ్యత్యాసాన్ని స్పష్టంగా తెలుపుతున్నప్పటికీ కూడా (రోమా 9: 6-8, 11: 1-7).
పరిస్థితి ప్రజలు తయారు చేసినంత నలుపు తెలుపు గా (ఖచ్చితంగా) లేదు. అన్వేషించాల్సిన మరియు అర్థం చేసుకోవలసిన బూడిదవర్ణ ప్రాంతాలు ఉన్నాయి. "సంఘము" అనగా అన్యజనులు మాత్రమే కాదు. "ఇశ్రాయేలు" ఎల్లప్పుడూ యూదులు మాత్రమే కాదు. జాతీయ ఇశ్రాయేలు మరియు శేష ఇశ్రాయేలు మధ్య ముఖ్యమైన ఆత్మీయ వ్యత్యాసం ఉంది.
సంఘము అంటే ఏమిటి?
క్రీస్తు యొక్క ఆత్మీయ శరీరాన్ని నిర్మించుటకు లోకంనుండి పిలువబడిన యూదులు మరియు అన్యజనుల సమూహమే సంఘము (ఎఫెసీయులు 5:23; కొలొస్సయులు 1:18; 1 కొరింథీయులు 12:13). సంఘంలో ఉన్నవారు ఆత్మ ద్వారా మరియు మెస్సీయ ద్వారా ఏకమై యుందురు. వారు "క్రీస్తులో" ఉన్నారని చెప్పబడుదురు (రోమా 8: 1; 2వ కొరింథీయులు 5:17; ఎఫెసీయులు 1:13).
మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటముల యెడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక, అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి? (రోమీయులకు 9:23-24)
సంఘం అనగా దేశాలనుండి భౌతికంగా పిలువబడిన యూదులు, అంతేకాకుండా అవిశ్వాసులైన ఇశ్రాయేలు దేశంనుండి ఆత్మీయంగా పిలువబడిన వారు మరియు ఇశ్రాయేలు ఎలోహిమును ఆరాధించుటకు అన్యదేశాల నుండి ఆధ్యాత్మికంగా పిలువబడిన వారు.
ఆత్మీయంగా పిలువబడిన ఇద్దరు ప్రజలూ, సంఘం అనే ఒక్క పిలువబడిన-ప్రజలుగా ఏర్పాటగుదురు. పిలువబడినవారు తమ ఆత్మీయ తండ్రియైన అబ్రహాము మాదిరిగా విశ్వాసం ద్వారా రక్షింపబడతారు (రోమా 4:11). ఈ విధంగా, సంఘంలో కొందరు మాత్రమే శారీరకంగా యూదులు కాగా, సంఘంలో అందరూ ఆత్మీయంగా యూదులు. వారు హృదయంలో సున్నతి పొందినవారు (రోమా 2:29), అబ్రహాము సంతానం (రోమా 4:16) మరియు ఇశ్రాయేలు పౌరులు (ఎఫెసీయులు 2:12, 19).
ఇశ్రాయేలు అంటే ఏమిటి?
ఇశ్రాయేలు అనగా వివిధ అర్ధాలు ఉన్నాయి. మొదటిది, ఇది తరచుగా జాతీయ ఇశ్రాయేలును సూచిస్తుంది - యాకోబు/ఇశ్రాయేలు యొక్క భౌతిక వారసులు అయిన పౌరులు. రెండవదిగా, యహువః పిలుపునకు స్పందించని యాకోబు యొక్క భౌతిక వారసులని అర్థం (రోమా 9:31, 11: 7). మూడవదిగా, యహువః వాగ్దానాలపై నమ్మకంతో ఉన్న యూదులు (శేషం) అని అర్ధం.
అయితే ఎలోహీం మాట తప్పిపోయినట్టు కాదు; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలీయులు కారు. అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకువల్లనైనది నీ సంతానము అనబడును (రోమీయులకు 9:6-7).
అబ్రాహాము యొక్క భౌతిక వారసునిగా ఉంటూ, దానివలన ఒక ప్రయోజనాన్ని కలిగియున్నప్పటికీ (రోమా 3: 1-2), అతడు స్వయంచాలకంగా అబ్రాహాము యొక్క ఆధ్యాత్మిక వారసుడని అర్ధం కాదు (రోమా 2: 28-29; యోహాను 8:39; మత్తయి 3: 9 ). "ఇశ్రాయేలీయుల సంతతి వారందరు ఇశ్రాయేలీయులు కారు." ఒక వ్యక్తి జాతీయ ఇశ్రాయేలులో భాగం అయినప్పటికీ, శేషించిన ఇశ్రాయేలులో భాగం కాకపోవచ్చు. ఇశ్రాయేలులోపల ఒక ఇశ్రాయేలు ఉంది, అది భౌతిక యూదుల (జాతీయ ఇశ్రాయేలు) మధ్యలో గల భౌతిక మరియు ఆత్మీయ యూదుల ఉపసమూహం (శేషించిన ఇశ్రాయేలు).
యహూషువః 2 మెస్సీయ నందు విశ్వాసం ద్వారా అన్యజనులు అబ్రాహాము యొక్క ఆత్మీయ వారసులుగా మారినప్పుడు, వారు కూడా ఈ ఉపసమూహంలో (శేషించిన ఇశ్రాయేలులో భాగం) భాగమవుతారు. విశ్వాసులైన అన్యజనులను శేషించిన ఇశ్రాయేలీయుల మధ్యలో ఉంచుట పౌలు చెప్పిన ఒలీవ చెట్టు దృష్టాంతంలో స్పష్టంగా చూపబడింది.
ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే; వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుటలేదు.
అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది; వారు అవి శ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము; ఎలోహీం స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి ఎలోహీం అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద ఉన్న ఎలోహీం అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు. వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; ఎలోహీం వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.
ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవచెట్టున అంటు కట్టబడరా? (రోమీయులకు 11:16-24)
ఒలీవ చెట్టు
ఈ సంక్లిష్ట భాగాన్ని అర్థం చేసుకొనుట, దాని నిబంధనలను విశ్లేషించడానికి సహాయపడుతుంది.
(1) పరిశుద్ధమైన మొదటి పిడికెడు/ వేరు. కొంతమంది అబ్రాహామును మొత్తం ముద్దంతటిని మరియు కొమ్మలను పవిత్రంగా చేసే పవిత్ర పిడికెడు/వేరుగా భావించినప్పటికీ, ఈ స్థానానికి సంపూర్ణంగా సరిపోవువాడు యహూషువః. పౌలు వేదాంతశాస్త్రంలో మరియు యహువః వాక్యంలో, ఇతరులను పవిత్రపరచగల ఏకైక వ్యక్తి మెస్సీయ (యెషయా 53: 2-6; రోమా 5: 18-19, 10: 4; 1వ కొరింథీయులు 1:30; 2వ కొరింథీయులు 5:21; ఎఫెసీయులకు 5:26; ఫిలిప్పీయులకు 3: 9; హెబ్రీయులు 2:11, 11: 39-40).
మరింత ఆధారం రోమా 9: 3-4 లో కనుగొనబడును. "పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్య మైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును.." పౌలు క్రీస్తు నుండి వేరుగా ఉండుటను ఆయన నుండి "నరికివేయబడుట" అని ఒలీవ చెట్టు రూపకానికి అనుగుణమైన భాషను చూపుతూ, మరియు క్రీస్తుని దానికి వేరుగా పోల్చాడు.
(2) అడవి ఒలీవ చిగురు. ఇది ఒక అన్యజనునికి సూచన. చిగురు అనగా ఒక చిన్న, లేత మొలక, అభివృద్ధి చెందని శాఖ.
(3) సహజమైన కొమ్మలు. ఇది యూదు-విశ్వాసులకు సూచన. అన్య విశ్వాసి ఒక అడవి ఒలీవ కొమ్మగా ఉండగా యూదు విశ్వాసి ఒక సహజమైన/నిజమైన కొమ్మ.
(4) ఒలీవ చెట్టు. అవిశ్వాసులైన యూదులు ఒలీవ చెట్టులో భాగం కారు. వారు నరికివేయబడిరి. కావున జాతీయ ఇశ్రాయేలు ఖచ్చితంగా ఒలీవ చెట్టుగా చెప్పబడుటలేదు. కానీ ఒలీవ చెట్టు ఇశ్రాయేలు యొక్క కొన్ని అంశాలను ఖచ్చితంగా సూచించాలి, ఎందుకంటే, యూదు-విశ్వాసులకు అది వారి స్వంత ఒలీవ చెట్టు.
ఒలీవ చెట్టు శేషించిన ఇశ్రాయేలును సూచిస్తుంది. ఈ ఆలోచన ఈ ప్రకరణం యొక్క సందర్భానికి బాగా సరిపోతుంది. అంతకుముందు, పౌలు నిజమైన ఇశ్రాయేలు (9: 6), ఇశ్రాయేలు యొక్క శేషము (9:27, 11: 5), ఎన్నుకోబడిన ఇశ్రాయేలు (11: 7) ను గూర్చి ప్రస్తావించారు.
శేషించిన ఇశ్రాయేలు = సంఘము
ఒలీవ చెట్టు శేషించిన ఇశ్రాయేలును సూచిస్తుంది, అయితే ఇది సంఘమును కూడా సూచిస్తుందా? ఒలీవ చెట్టు మెస్సీయ చేత పవిత్రం చేయబడిన యూదులు మరియు అన్యజనుల సమూహం. ఇది కూడా సంఘం యొక్క ఖచ్చితమైన వర్ణన (ఎఫెసీయులు 3: 6). ఒలీవ చెట్టు ఉపమానంతో పౌలు అన్య విశ్వాసులకు, (రోమా 11:13) సంఘ సభ్యులకు వ్రాస్తున్నాడు. అయితే, ఒలీవ చెట్టు చెట్టు ఉపమానం యొక్క అసలు సందర్భం సంఘం కోసం కాదు. రోమా పత్రికలో, పౌలు ఎక్లేసియను మొదటిగా 16 వ అధ్యాయంలో (వచనాలు. 1, 5, 23) ఉపయోగించెను, ఇక్కడ ఇది స్థానిక సమావేశాలను సూచిస్తుంది, మొత్తం విశ్వాసుల సమూహాన్ని కాదు. ఒలీవ చెట్టు ఉపమానం యొక్క సందర్భం శేషించిన ఇశ్రాయేలు (రోమా 11: 5, 7) - "వారి [యూదా ప్రజల] సొంత ఒలీవ చెట్టు. (11:24).
పౌలు తన ఒలీవ చెట్టు దృష్టాంతాన్ని యూదా ప్రజల కోసం మాత్రమే పరిమితం చేసి ఉంటే, శేషించిన ఇశ్రాయేలు కొంత సంఘం నుండి వేరుచేయబడినవారిగా, కొంత సంఘంలో ఉంచబడినవారిగా ఉండాలి. అన్య విశ్వాసులు ఒలీవ చెట్టులో అంటుకట్టబడి ఉన్నందున, శేష-ఇశ్రాయేలు భౌతిక యూదులకు మాత్రమే పరిమితం కాదని స్పష్టంగా తెలుస్తుంది, అయితే, వారివలె విమోచన పొంది సంఘంలో సభ్యులుగా ఉన్న ఇతర ప్రజలను కూడా దీనిలో ఉందురు.
పౌలు యొక్క ఒలీవ చెట్టు ఉపమానం అతని మానవ శరీరం యొక్క ఉపమానంతో సమానంగా ఉంటుంది (రోమా 12: 4-5; 1 కొరింథీయులు 12: 12). అతడు ఈ రెండు ఉపమానాలను ఒకదానికొకటి దగ్గర పోలికగా ఉపయోగించెననే వాస్తవం (రోమా 11 మరియు 12) తాను రెండింటిలో ఒకే సమూహం గురించి మాట్లాడుతున్నట్లు తెలియజేస్తుంది. శరీరం యొక్క ఉపమానంలో, శరీరంలోని మిగిలిన భాగాలకు దిశానిర్దేశం చేసే శిరస్సు మెస్సీయ. అదేవిధంగా, ఒలీవ చెట్టు ఉపమానంలో, చెట్టు దాని జీవనోపాధిని మరియు వేరును మెస్సీయ నుండి పొందుతుంది. రెండు ఉపమానాలలో, సభ్యత్వం పొందువారు యూదులు మరియు అన్యులే. ఒకదానికి: యూదులు మరియు అన్యులు శరీర భాగాలు; మరొకదానికి: యూదులు కొమ్మలు మరియు అన్యజనులు చిగుళ్లు.
మూడవ ఉపమానం పౌలు మరియు పేతురు ద్వారా చెప్పబడిన ఆత్మీయ దేవాలయము (ఎఫెసీయులు 2: 19-22; 1 పేతురు 2: 4-6). ఇక్కడ, మెస్సీయ ప్రధాన మూలస్తంభం మరియు విమోచించబడిన ప్రజలు (యూదులు మరియు అన్యజనులు) ఆత్మీయ కట్టడమును ఏర్పరుస్తున్న సజీవమైన రాళ్ళు. ఈ మూడు అలంకారాలు - ఒలీవల చెట్టు, మానవ శరీరం, ఆత్మీయ దేవాలయం - విమోచన పొందిన యూదులు మరియు అన్యజనుల యొక్క ఒకే సమూహం గురించి మాట్లాడుచున్నవి. ఈ సమూహాన్ని సంఘం, సమాజం, మెస్సీయ శరీరం, క్రీస్తు శరీరం, యహువః కుటుంబం అని పిలుస్తారు - అన్య విశ్వాసులు ఇకపై పరాయివారు కారు (1 తిమోతి 3:15; ఎఫెసీయులు 2:19), శేష ఇశ్రాయేలుతో - అన్య విశ్వాసులు అంటుకట్టబడుదురు (రోమా 11:17).
సంఘం: క్రొత్తది మరియు క్రొత్తది కాదు
సంఘం కొత్తది. క్రొత్త నిబంధన లేఖనాల్లో, సంఘం యొక్క మొదటి ప్రస్తావన మత్తయి 16: 18 లో కనుగొనబడుతుంది, ఇక్కడ యహూషువః తన సంఘాన్ని నిర్మించుటను గూర్చి మాట్లాడెను. అందువల్ల, సంఘం ఒక క్రొత్త పని, ప్రత్యేకించి మెస్సీయ సమాజం ఆయన ప్రాయశ్చిత్త-మరణం మరియు పునరుత్థానం ఆధారంగా నిర్మించబడుతుంది. శారీరకంగా ఐగుప్తు నుండి ఎక్లేసియాను (ఇశ్రాయేలీయులను) తీసుకువచ్చిన మోషే మాదిరిగానే, మెస్సీయ తన ఎక్లేసియాను ప్రపంచం నుండి ఆత్మీయంగా బయటకు తీసుకువచ్చి, యూదులు మరియు అన్యజనులను కలిగి ఉన్న ఒక ఆత్మీయయ సమాజముగా ఏర్పాటు చేసెను.
క్రొత్త నిబంధన ప్రకారం మనలో నివశించు ఆత్మ యొక్క వాగ్దానమును బట్టి సంఘం నూతనమైనది (యెహెజ్కేలు 36: 24-26; యిర్మీయా 31: 31-33). సంఘం యొక్క రహస్య అంశం ఏమిటంటే, యూదులు కానివారు కూడా ఆత్మను స్వీకరిస్తారు మరియు ఆత్మ ద్వారా ఒకే శరీరంలో (విశ్వశించిన యూదులతో) ఉంచబడతారు (అపొస్తలుల కార్యములు 10:45, 15: 8; ఎఫెసీయులు 2: 19-3: 6). ఇది ఒక రహస్యం, ఎందుకంటే క్రొత్త నిబంధన మరియు ఆత్మ యొక్క ఆగమనం రెండూ ఇశ్రాయేలీయులకు మరియు యూదా ఇంటివారికి మాత్రమే వాగ్దానం చేయబడినవి (యిర్మీయా 31:31), అన్యజనులకు కాదు. అలా ఇది పాత నిబంధనలో, చాలా తక్కువగా, అనగా అబ్రాహాముకు ఇచ్చిన నిబంధన లాంటి వాటిలో దాచబడినది, ఇతడిని సంతానం (మెస్సీయ) సమస్త దేశాలకు ఆశీర్వాదం అవుతుంది.
కానీ సంఘం కొత్తది కాదు. సంఘం క్రొత్తది కాదు ఎందుకంటే అది శేషించిన ఇశ్రాయేలు. కొంతమంది పౌలు చెప్పిన ఒలీవ చెట్టు అనగా సంఘం అని, మరికొందరైతే అది ఇశ్రాయేలు అని పేర్కొన్నారు. అయితే దీనిని శేషించిన ఇశ్రాయేలుగా చూచినప్పుడు ఈ గందరగోళం పరిష్కారమవుతుంది. ఒలీవ చెట్టు శేషించిన ఇశ్రాయేలు మరియు ఇదియే సంఘం, ఎందుకంటే సంఘం శేష ఇశ్రాయేలు. అపొస్తలుల కార్యములు 3 లో పేతురు చేసిన ప్రసంగం నుండి దీనికి మరింత ఆధారం లభిస్తుంది. యూదా విశ్వాసులతో మాట్లాడుతున్నప్పుడు, యహూషువః మెస్సీయయే ప్రవచనానికి నెరవేర్పు అని చెప్పాడు:
మోషే యిట్లనెను; అదోనాయ్ ఎలోహీం నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను." (అపొస్తలుల కార్యములు 3:22-23)
ఒక యూదుడు యహూషువఃను విశ్వసించి, ఆత్మలో జన్మించినప్పుడు, అతడు క్రీస్తు శరీరం అయిన చర్చిలో సభ్యుడగును. ఏదేమైనా, ఒక యూదుడు యహూషువఃను విశ్వసించకపోతే, అతడు యూదుల నుండి "నరికివేయబడతాడు" (పౌలు యొక్క ఒలీవ చెట్టు దృష్టాంతంలో చెప్పబడినది ఇదే). పౌలు మాత్రమే కాదు, పేతురు కూడా సంఘమును శేషించిన ఇశ్రాయేలుకు సమానమని చేసెనని ఇది చూపిస్తుంది.
శేషించిన ఇశ్రాయేలే సంఘము అనే వాస్తవం విశ్వాసుల శాశ్వత నివాసమైన నూతన యెరూషలేము పేర ద్వారా, ఆ నివాసపు గుమ్మముల ద్వారా (ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రముల పేర్లు), ఆ ఇంటి స్తంభాల ద్వారా (యహూషువః యొక్క పన్నెండు ఇశ్రాయేలీ అపొస్తలులు), మరియు ఆ ఇంటి సింహాసనంపై ఆసీనుడైనవాని ద్వారా (ఇశ్రాయేలు రాజు అయిన యహూషువః, ఆయన కూడా ఇశ్రాయేలీయుడు) రుజువు చేయబడింది.
సంఘం శేషించిన ఇశ్రాయేలు అయినందున, పౌలు - ఖచ్చితంగా సంఘ సభ్యుడు - అతడు యహూషువఃను విశ్వసించెను గనుక, తాను శేషించిన ఇశ్రాయేలులో భాగమని చెప్పగలడు (రోమా 11: 1-5). సంఘం శేష ఇశ్రాయేలు అయినందున, యహూషువః నందలి అన్య విశ్వాసులు శేష ఇశ్రాయేలుతో అంటుకట్టబడిరని పౌలు చెప్పగలడు (రోమా 11:17). సంఘం శేష ఇశ్రాయేలు అయినందున, పౌలు మరియు పేతురు ఇద్దరూ యహూషువఃను అంగీకరించని యూదులు ఇశ్రాయేలు నుండి నరికివేయబడుదురని చెప్పగలరు (రోమా 11:17; అపొస్తలుల కార్యములు 3:23). సంఘం శేష ఇశ్రాయేలు అయినందున, అన్య విశ్వాసులు ఇకపై "ఇశ్రాయేలుతో సహ వారసత్వం నుండి తొలగించబడరు" మరియు "వాగ్దాన నిబంధనకు పరదేశులు కారు" అని పౌలు చెప్పగలడు (ఎఫెసీయులు 2:12). సంఘం శేష ఇశ్రాయేలు అయినందున, అన్య విశ్వాసులు "ఇకపై పరదేశులుగాని ఇతరులుగాని కారని, యహువః ప్రజలతో సహ పౌరులు మరియు యహువః ఇంటి సభ్యులు" అని పౌలు చెప్పగలడు (ఎఫెసీయులు 2:19).
సంఘం శేష ఇశ్రాయేలు నుండి పూర్తిగా వేరుగా ఉండే లేదా దానిని భర్తీ చేసే సంపూర్ణమైన నూతన నిర్మాణం అయితే, ఈ సత్యాలు అర్ధవంతంగా ఉండవు.
ముగింపు
చాలా కాలంగా ఇశ్రాయేలు మరియు సంఘం మధ్య అనుచితమైన వ్యత్యాసం ఉంది. ఈ లోపం రెండు కారణాల వల్ల సంబంధించినది: (1) యూదులు మరియు అన్యజనుల మధ్య బైబిలు వ్యత్యాసాన్ని ప్రజలు సరిగ్గా గమనించారు, కాని ఇశ్రాయేలు యూదులకు సమానమని మరియు సంఘం అన్యజనులకు సమానమని వారు తప్పుగా అనుకొనుట వలన. ఇశ్రాయేలు మరియు సంఘం రెండూ యూదులు మరియు అన్యజనులను కలిగి ఉన్నాయి, మరియు యూదులు మరియు అన్యజనుల మధ్య వ్యత్యాసం ఇశ్రాయేలు మరియు సంఘం మధ్య వ్యత్యాసానికి సమానం కాదు.
(2) సంఘానికి మరియు ఇశ్రాయేలుకు మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడునప్పుడు, ప్రజలు జాతీయ ఇశ్రాయేలు మరియు శేష ఇశ్రాయేలు మధ్య అవసరమైన వ్యత్యాసాన్ని చూపించుటలో విఫలమయ్యారు. శేష ఇశ్రాయేలు ఒక ఆత్మీయ శరీరం, జాతీయ ఇశ్రాయేలు కాదు.
అన్య విశ్వాసులు శేష ఇశ్రాయేలుతో అంటుకట్టబడతారు, దీని పవిత్ర మూలం (వేరు) మెస్సీయ. అన్య విశ్వాసులు విశ్వసించని యూదుల స్థానాన్ని పొందుతారు, అయితే మొత్తం యూదుల స్థానాన్ని అన్యజనులు భర్తీ చేయరు. ఇశ్రాయేలులో కొంత భాగం మాత్రమే కఠినతరం చేయబడెను (రోమా 11:25). మరియు వారు విశ్వసించినప్పుడు యహువః యూదులను తిరిగి శేష ఇశ్రాయేలుతో/సంఘముతో అంటుకట్టును. (రోమా 11:23).
ఇశ్రాయేలు మరియు సంఘం యొక్క సరైన అవగాహన ప్రత్యామ్నాయ/భర్తీ వేదాంతము లేదా విభజన వేదాంతము కాదు. సంఘం జాతీయ ఇశ్రాయేలును భర్తీ చేయలేదు. జాతీయ ఇశ్రాయేలు ఎన్నడూ ప్రజల ఆత్మీయ శరీరం కాదు, కానీ కేవలం ఇతర దేశాల మాదిరిగా రక్షణపొందిన మరియు రక్షణపొందని వారు గల దేశం. మరియు యహువః ఇశ్రాయేలు దేశం విషయంలో నెరవేర్చవలసిన భవిష్య ప్రణాళికను కలిగియుండెను. అలాగే సంఘం శేషించిన ఇశ్రాయేలును భర్తీ చేయదు. పౌలు తనను తాను శేషించిన ఇశ్రాయేలు (రోమన్లు 11: 1-5), క్రీస్తులో భాగం (రోమన్లు 9: 3), మరియు సంఘంలో భాగం (ఎఫెసీయులకు 5: 29-30) అని గుర్తించెను. సంఘము (క్రీస్తు శరీరము) మరియు శేషించిన-ఇశ్రాయేలు అనేవి పర్యాయపదాలు అని ఇది మనకు చూపిస్తుంది.
అందువల్ల, సంఘం శేష ఇశ్రాయేలు నుండి వేరైనది కాదు. సంఘమే శేష ఇశ్రాయేలు. క్రీస్తునందలి విశ్వాసం ద్వారా, అన్య విశ్వాసులు ఇశ్రాయేలు పౌరసత్వం నుండిగాని లేదా వాగ్దానం యొక్క ఒడంబడిక నుండిగాని వేరుచేయబడరు (ఎఫెసీయులు 2:12). వారు సంఘంలోకి ఒలీవ చెట్టుకు అంటుకట్టబడ్డారు, ఒలీవ చెట్టు యూదా ప్రజలకు సహజమైనది కాని అన్యజనులకు అసహజమైనది. ఈ కారణంగానే సంఘంలో తమ సభ్యత్వం విషయంలో అహంకారంగా ఉండవద్దని పౌలు తన అన్యజన పాఠకులకు బోధిస్తున్నాడు (రోమా 11:20).
"రిమ్నేంట్ థియోలజీ | ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆన్ ది చర్చ్ అండ్ ఇజ్రాయెల్"
జాన్ గే ద్వారా. http://www.leaderu.com/theology/remnanttheo.html
1 "దేవుడు" అనే పేరు యహువఃతో భర్తీ చేయబడెను.
2 "యేసు" అనే పేరు యహూషువఃతో భర్తీ చేయబడెను.