క్రీస్తు ఏ క్షణంలోనైనా రావచ్చనే విధానంలో అపొస్తలులు ఎదురు చూసారా?
ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము. |
ఈ ప్రశ్నకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది బైబిలు విద్యార్థులు వెంటనే “అవును, వారు అలానే చూసారు” అని సమాధానమిస్తారు మరియు నేటి విశ్వాసులకు కూడా అదే నిరీక్షణ ఉందని నిస్సందేహంగా చెబుతారు. క్రీస్తు "ఏ క్షణాన్నైనా" రావచ్చు అనే ఈ దృక్కోణం, డిస్పెన్సేషనలిజం అని పిలువబడే వివరణాత్మక వ్యవస్థలో కీలకమైన సిద్ధాంతం మరియు దానికి సంబంధించిన సంఘం యొక్క "శ్రమలకు ముందు ఎత్తుబాటు" అని పిలవబడే (ఇది గొప్ప శ్రమల కాలానికి మరియు అంత్యక్రీస్ర్తు వచ్చుటకు ముందు అంతకు ముందు జరిగునట్లు చెప్పబడే) విశ్వాసంతో ముడిపడి ఉంది.
ఈ వ్యవస్థ యొక్క పూర్తి పరిశీలనను సమయం అనుమతించదు. కానీ నేను చేయాలనుకుంటున్నది ఏమిటంటే, ఏ క్షణమైనా రాకడ వచ్చుననుటకు ఉపయోగిస్తున్న కొన్ని లేఖనాలను తీసుకొని మరియు వాటిలో ఏ ఒక్కటీ “అవును, క్రీస్తు ఏ క్షణంలోనైనా వచ్చునని అపొస్తలులు విశ్వసించారు" అనే వాదనకు సరిగ్గా ఉపయోగపడదని చూపించుట." మరియు చివరిలో, క్రీస్తు తిరిగి వచ్చుటకు ముందు జరగాల్సిన కొన్ని సంఘటనల యొక్క ఖచ్చితమైన క్రమం ఉందని మరియు ఈ క్రమాన్ని లేఖనాల్లో స్పష్టంగా చూడవచ్చని నేను చూపించాలనుకుంటున్నాను.
“సజీవులమై నిలిచియుండు మనము ...”
మొదటి వాదన క్రీస్తు రాకడకు సంబంధించిన కొన్ని భాగాలలో వ్యక్తిగత సర్వనామాలను ఉపయోగించడంపై ఆధారపడింది. పౌలు థెస్సలొనీకయులతో ఇలా అన్నాడు, "ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము..." (1 థెస్స. 4:15). ఇది "ఏ క్షణంలోనైనా రాకడ" ను బలపరిచే ప్రముఖ వచనం. పౌలు తనను తాను ప్రభువు రాకడవరకు సజీవంగా ఉండే సమూహంలో చేర్చుకున్నట్లు కనిపిస్తాడు మరియు మొదటి చూపులో ఇది చాలా సమ్మతించదగినదిగా కనిపిస్తుంది.
1 యోహాను 3:2 ఇదే భాషని ఉపయోగిస్తుంది: “ప్రియులారా, యిప్పుడు మనము యహువః పిల్లలమైయున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.” యోహాను ఇక్కడ క్రీస్తు రాకడ వరకు తాను సజీవంగా ఉందునని చెప్పినట్లు కనిపిస్తున్నాడు.
ఈ విధంగా వ్యక్తిగత సర్వనామాలను ఉపయోగించడం అనేది విషయాన్ని రుజువు చేయదు, ఎందుకంటే ఇది బైబిలు రచయితలు తమకు చెందిన సంఘాన్ని సూచించే క్రమమైన మరియు స్థిరమైన మార్గం. "పరోసియా వరకు సజీవంగా మిగిలి ఉన్న మనం" అనగా "పరోసియా వరకు సజీవంగా ఉండే క్రైస్తవ సమాజంలోని వారు" అని అర్ధం.1 దీనికి రుజువు క్రింది భాగాలలో కనుగొనబడింది.
సంఖ్యాకాండము 14లో అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలపాటు అరణ్యంలో సంచరించేలా శిక్షించబడ్డారు మరియు వారిలో ఏ ఒక్కరూ వాగ్దానం చేయబడిన దేశంలోకి ప్రవేశించరని వారికి స్పష్టంగా చెప్పబడింది. ఇంకా మనం సంఖ్యాకాండము 15: 2లో ఇలా చదువుతాము, “మీ కిచ్చుచున్న దేశనివాసములలో మీరు ప్రవేశించిన తరువాత ...” ఇక్కడ “మీరు” అనే సర్వనామం అరణ్యంలో చనిపోయేలా శిక్ష విధించబడిన వ్యక్తులను ఉద్దేశించదు (పదాలు వారిని ఉద్దేశించినప్పటికీ). స్పష్టంగా ఇది వారి వారసులను, వాగ్దాన భూమిలోకి ప్రవేశించేవారిని సూచిస్తుంది. పదం యొక్క ఈ ఉపయోగం "సామూహిక సంబంధమైనది" అని మనము చెప్పవచ్చు, అంటే, ఇది సమూహాన్ని సూచిస్తుంది మరియు ప్రసంగించే వ్యక్తులను తప్పనిసరిగా చేర్చదు.
ద్వితీయోపదేశకాండము 11:7: "యహువః చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా." ఇది అరణ్య ప్రయాణం ముగింపులో చెప్పబడింది మరియు ఇది నిర్గమ సమయంలో జరిగిన అద్భుతాలను సూచిస్తుందని మునుపటి వచనాలు చూపిస్తున్నాయి. అయినప్పటికీ దేశంలోని అత్యధికులు వీటిని వ్యక్తిగతంగా చూడలేదు. మళ్ళీ ఇది సమూహాన్ని సూచిస్తుంది, ఈ సందర్భంలో వారి పూర్వీకులను సూచిస్తుంది.
న్యాయాధిపతులు 2:1: ప్రభువు దూత ఇలా అన్నాడు, "నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణముచేసిన దేశము నకు మిమ్మును చేర్చి ..." మళ్ళీ, ఇక్కడ మిమ్మును అనే సర్వనామం వారి పూర్వీకులను సూచిస్తుంది మరియు వ్యక్తిగతంగా వారిని కాదు.
దానియేలు ప్రవక్త తాను వ్యక్తిగతంగా నిందారహిత జీవితాన్ని గడిపినప్పటికీ దానియేలు 9: 5-6లో తన ప్రజల పాపాలతో తనను తాను ముడిపెట్టుకున్నాడు. అపొస్తలుడైన పౌలు కూడా తీతు 3: 3లో ఇలా చెప్పాడు, “మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి ...” పౌలు యొక్క వాస్తవ జీవతం కోసం 2 తిమోతి 1: 4, అపొస్తలుల కార్యములు 23: 1 మరియు ఫిలిప్పీయులకు 3: 6 చూడండి.
2 కొరింథీయులు 4: 14లో పౌలు, "ప్రభువైన యహూషువఃను లేపినవాడు యహూషువఃతో మమ్మునుకూడ లేపి, మీతోకూడ తన యెదుట నిలువ బెట్టును.." అని చెప్పుటను గమనించండి. తాను చనిపోతాడని మరియు క్రీస్తు రాకడలో పునరుత్థానం చేయబడతాడని ఇక్కడ అతడు స్పష్టంగా ఊహించాడు. 1 థెస్సలొనీకయులో చెప్పిన దానినుండి అతను తన మనసు మార్చుకున్నాడా? ఉదారవాద వేదాంతవేత్తలు అతడు అలా చేశాడని నమ్ముతారు, అయితే ఇది మన ప్రేరణ (దైవావేశ) సిద్ధాంతం విషయంలో ఏమి చెబుతుంది? ఏ ప్రకటన దైవావేశంతో చేయబడెను మరియు ఏది తప్పు? రెండూ దైవావేశ పూరితమైనవే. పౌలు స్థిరంగా లేఖనాల యొక్క సామూహిక భాషని వర్తింపజేస్తున్నాడు మరియు వారందరూ చెందిన సమాజం గురించి మాట్లాడుతున్నాడు.
సర్వనామాల యొక్క ఈ వినియోగం లేఖనాలయందంతటా స్థిరంగా ఉంటుంది మరియు దీనిని "సాధారణ భాష" గా పరిగణించవచ్చు, అనగా మనం ఈ విధంగా ఉపయోగించబడిన సర్వనామాలను ఎక్కడ చూసినా, వాటి వినియోగం సామూహిక సంబంధమైనదిగా ఉంటుంది. లేఖనాల భాషను దీనికి భిన్నంగా అన్వయించాలనుకునే వారు నిజంగా కొన్ని నమ్మదగిన రుజువులను పుట్టించాల్సి ఉంటుంది.
రెండవ రాకడ యొక్క భాష
అవసరమైన ప్రయోజనాల దృష్ట్యా, రెండవ రాకడకు సంబంధించి డిస్పెన్సేషనలిస్టులు (దైవసంకల్ప సిద్ధాంతీకులు) ఏమి విశ్వసిస్తున్నారో మనం సంగ్రహించాలి. కింది వ్యాఖ్య అలెగ్జాండర్ రీస్ రచించిన ది అప్రోచింగ్ అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్ నుండి, మరియు వివిధ డిస్పెన్సేషనలిస్టుల రచనలను గూర్చి అతని అధ్యయనం నుండి సంకలనం చేయబడింది. డిస్పెన్సేషనలిస్టులు చూసినట్లుగా, విషయాన్ని అర్థం చేసుకొనుటకు అవసరమైన అనేక ముఖ్యమైన పదాలను ఈ ప్రకరణం నొక్కి చెబుతుంది:
“క్రీస్తు రెండవ రాకడ రెండు విభిన్న దశల్లో జరుగుతుంది; మొదటిది, సంఘానికి మాత్రమే సంబంధించినది, ఇది దానియేలు చివరి లేదా విధ్వంసకర వారానికి ప్రారంభంలో లేదా ముందు జరుగుతుంది; రెండవది, ఇశ్రాయేలు మరియు ప్రపంచానికి సంబంధించినది, ఇది ఆ వారానికి చివరిలో జరుగుతుంది. సంఘానికి సంబంధించి క్రీస్తు రాకడకు మరియు ప్రపంచానికి సంబంధించిన క్రీస్తు రాకడకు మధ్య, కనీసం ఏడు సంవత్సరాల వ్యవధి ఉంటుంది — ఇది విధ్వంసకర వారం యొక్క కాలం, ఈ సమయంలో క్రీస్తువిరోధి బయలుపడతాడు. రాకడ యొక్క మొదటి దశలో, క్రీస్తులో చనిపోయిన వారందరూ, పాతనిబంధన యొక్క నీతిమంతులతో పాటుగా, క్రీస్తు యొక్క రూపం మరియు మహిమలోనికి లేపబడతారు; వీరు, ప్రభువు రాకడ వరకు సజీవంగా ఉన్న క్రైస్తవులతో కలిసి, ప్రభువును ఎదుర్కొనుటకు గాలిలో ఎత్తడతారు. ఇది ప్రభువు రాకడ, మరియు సంఘం యొక్క నిజమైన నిరీక్షణ.
“రెండవ దశలో, ఏడు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల తరువాత, క్రీస్తువిరోధి నాశనం చేయబడుతాడు, ఇశ్రాయేలు మారుమనస్సు పొందును పునరుద్ధరించబడును మరియు వెయ్యేళ్ల రాజ్యం ఏర్పాటు చేయబడును. ఇది క్రీస్తు కనిపించే లేదా ప్రత్యక్షమయ్యే దినం, మరియు రాకడకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే ఇది సంఘానికి మాత్రమే సంబంధించినది. రాకడ యొక్క రెండవ దశ దీనిని కలిగి ఉంది మరియు ఇది సంఘానికి సంబంధించినది, ఇది భూమిపై తాము చేసిన పరిచర్య నిమిత్తం పరలోక పరిశుద్ధుల యొక్క తీర్పు మరియు బహుమానానికి సంబంధించిన సమయం. అయితే కొందరు, రాకడ లేదా ఎత్తుబాటు సమయాన్ని (సాధారణంగా పిలవబడే మొదటి దశను) ప్రతిఫలమిచ్చే సమయంగా సూచిస్తారు” (పేజీ 19-20).
ఈ భాగం మన విషయాన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన అనేక పదాలను వివరణగా చెబుతుంది. ఎత్తబాటు, రాకడ, కనబడుట మరియు ప్రత్యక్షత అన్నీ డిస్పెన్సేషనల్ పథకంలోని సాంకేతిక పదాలు, మరియు అవి వాస్తవానికి డిస్పన్సేషనలిస్ట్లు చెప్పుకొనే అర్థాన్ని కలిగి ఉన్నాయో లేదో తెలుసుకొనుటకు మనము వాటిని క్లుప్తంగా పరిశీలించాలి.
ఎత్తుబాటు అనేది లాటిన్ పదం రేపెరే (rapere) నుండి ఉద్భవించింది, ఇది 1 థెస్సలొనీకయులు 4: 17లో హార్పజో (harpazo) అనే గ్రీకు పదానికి సమానం, ఇది గాలిలో ప్రభువును కలుసుకొనుటకు విశ్వాసులను పట్టుకోవడాన్ని వివరించడానికి ఉపయోగించబడింది. కాబట్టి దాన్ని ఆ సంఘటనను వివరించుటకు ఉపయోగించడంలో సమస్య లేదు. కానీ ఈ సంఘటనను డిస్పెన్సేషనలిస్ట్‌లు తప్పుగా అన్వయించారు మరియు దానిని శ్రమల కాలానికి ముందు వచ్చుననుకొనే రాకడకు వర్తింపజేసారు, అయితే మనం దాన్ని గూర్చి ఏమనుకుంటున్నామో అనేది వివరించడం ద్వారా దానియొక్క మన వినియోగం అర్హత పొందవలసి ఉంటుంది. బహుశా అపార్థాన్ని నివారించడానికి దీన్ని అస్సలు ఉపయోగించకుండా ఉండటమే మంచిది.
పరోసియా అనేది రాకడ యొక్క గ్రీకు పదం.1 థెస్సలొనీకయులకు 4లో పౌలు యొక్క దీని ఉపయోగం చర్చకు ప్రధానమైనది. “మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.” (1 థెస్సలొనీ. 4:15-18).
ఈ ప్రకరణంలో ఏదైనా రహస్యాన్ని కనుగొనడం కష్టం. పరోసియా అనేది క్రీస్తు తన పరిశుద్ధులతో పాటు వచ్చే సంఘటన: "మన ప్రభువైన యహూషువః తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు" (1 థెస్స. 3:13). ఇది డిస్పెన్సేషనలిస్ట్‌లు చేసిన కీలక వ్యత్యాసానికి విరుద్ధంగా ఉంది. పరోసియా, అనగా, క్రీస్తు పరిశుద్ధుల కోసం వచ్చినప్పుడు అని వారు అంటారు. ఆయన కేవలం ప్రత్యక్షత లేదా కనబడుట వద్ద మాత్రమే పరిశుద్ధులతో వస్తాడు అని వారు చెప్పెదరు.
ఏది ఏమైనప్పటికీ, పరోసియాలో క్రీస్తు పాపపురుషుని నాశనం చేస్తాడని 2 థెస్సలొనీకయులు 2: 8 చూపిస్తుంది: “అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యహూషువః తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన (పరోసియా) ప్రకాశముచేత నాశనము చేయును." ఈ వాక్యం డిస్పెన్సేషనలిస్ట్ పథకానికి విరుద్ధం. డిస్పెన్సేషనలిస్ట్ల ప్రకారం, పాప పురుషుడు (క్రీస్తు విరోధి) బయలుపడుటకు ముందు పరోసియా సంభవించవలసి ఉంది, అయితే ఇక్కడ మనకి క్రీస్తువిరోధి నాశన సమయంలో అది జరుగుతుంది.
పరోసియా అనేది ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తూ సంభవించే అద్భుతమైన సంఘటన మరియు అది ఒలీవల ప్రవచనం ముగింపులో జరుగుతుంది. "మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును." (మత్తయి 24:27).
ఈ సమయంలో డిస్పెన్సేషనలిస్టులు పరోసియా అంటే "ఎదుట/సముఖము" అని వాదిస్తారు మరియు అందువల్ల అది ఏడు సంవత్సరాల వ్యవధి ముగింపులో జరిగే ఎత్తుబాటు లేదా ప్రత్యక్షతతో సహా మొత్తం కాలాన్ని సరిపెడుతుంది. పరోసియా అనగా నిజానికి "ఎదుట/సముఖము" అని అర్ధం మరియు ఫిలిప్పీ 2: 12 లో అలా అనువదించబడింది, కానీ దాని సాధారణ అర్థం "రాక." పరోసియాను యహూషువః కోసం ఉపయోగించినప్పుడు, అది ఎల్లప్పుడూ అతని రాకడ, రెండవ రాకడ అని అర్థం. గత 150 సంవత్సరాలుగా పండితుల యొక్క నూతన ఆవిష్కరణలలో క్రీస్తు కోసం ఉపయోగించిన ఈ పదానికి స్పష్టమైన అర్థాన్ని జోడించారు. అలెగ్జాండర్ రీస్ ఇలా అంటున్నాడు: “ఆధునిక పాండిత్యం యొక్క గొప్ప రచనలలో ఇది ఒకటి, ప్రారంభ క్రైస్తవులు ప్రభువైన యహూషువః క్రీస్తు యొక్క పరోసియాను గూర్చి పౌలు లేఖనాన్ని చదివినప్పుడు వారు ఏమి భావించారో ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము. పండితులు మరియు పురావస్తు శాస్త్రవేత్తలు ఐగుప్తులోని చెత్త కుప్పలను తవ్వారు మరియు అనేక పత్రాలలో ఈ పదాన్ని రాజులు మరియు పాలకుల రాకకోసం లేదా రాజ్య సందర్శనకు వచ్చుటకోసం చెప్బడే రోజువారీ కార్యక్రలాపాలకు ఉపయోగించినట్లు కనుగొన్నారు. గొప్ప పండితుడైన అడాల్ఫ్ డీస్మాన్ని ఉదహరిస్తూ అతడు ఇలా అన్నాడు, "టోలెమిక్ కాలం నుండి క్రీ.శ. 2వ శతాబ్దం వరకు, రాజు లేదా చక్రవర్తి యొక్క రాక లేదా సందర్శనకు సాంకేతిక వ్యక్తీకరణగా తూర్పున ఈ పదాన్ని గుర్తించగలిగాము." క్రీస్తు రాకడకు దీని అన్వయం స్పష్టంగా ఉంది.
ప్రత్యక్షత అనేది గ్రీకు పదం అపోకలిప్స్ (అపోకలూప్సిస్) యొక్క అనువాదం. డిస్పెన్సేషనలిస్టుల ప్రకారం, క్రీస్తు ప్రపంచానికి తీర్పు తీర్చడానికి మరియు తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినప్పుడు శ్రమల తర్వాత ప్రత్యక్షత జరగాలి. సంఘం, తాను వాదిస్తున్నట్లుగా, శ్రమలకు ముందు "ఎత్తుబాటు" కోసం ఎదురుచూడకూడదు కానీ ప్రత్యక్షత కోసం ఎదురుచూడాలి. అయితే మనం ఎదురుచూసేది అది కాదు. మనము "మన ప్రభువైన యహూషువః క్రీస్తు యొక్క ప్రత్యక్షత (అపోకలూప్సిస్) కొరకు ఎదురు చూచుచున్నాము" (1 కొరి. 1:7). ప్రత్యక్షత అనేది కొంత కాలం బాధల తర్వాత పరిశుద్ధులు తమ విశ్రాంతి మరియు ఉపశమనాన్ని పొందే సంఘటన: “ప్రభువైన యహూషువః తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, యహువః నెరుగనివారికిని, మన ప్రభువైన యహూషువః సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట యహువఃకు న్యాయమే” (2 థెస్స. 1:6-8). కానీ మళ్ళీ, డిస్పెన్సేషనలిస్టుల ప్రకారం, పరిశుద్ధులు అప్పటికే సంఘ ఎత్తుబాటు వద్ద విశ్రాంతిని అనుభవిస్తారు. పేతురు కూడా ప్రత్యక్షతలో ముగించబడే శ్రమల కాలాన్ని సూచిస్తాడు. "క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి" (1 పేతురు 4:13).
ప్రత్యక్షత అనేది పరోసియాతో కలిసి క్రైస్తవ ఆశ యొక్క విషయము, మరియు ఇది "వ్యక్తీకరణ" అనే అర్ధాన్నిచ్చే గ్రీకు పదమైన ఎపిఫానియాకు సంబంధించినది, ఇది క్రీస్తు రాకడకు ఉపయోగించే మూడవ ప్రత్యేకమైన పదం. ఈ పదం నిజానికి 2 థెస్సలొనీకయులు 2: 8లో పరోసియాతో పాటు ఉపయోగించబడింది, ఇది క్రీస్తు "తన పరోసియా యొక్క ఎపిఫెనియా" వద్ద పాప పురుషుని నాశనం చేయడం గురించి మాట్లాడుతుంది. పౌలు తిమోతిని “మన ప్రభువైన యహూషువః క్రీస్తు ప్రత్యక్షమయ్యే (ఎపిఫెనియా) వరకు నిర్దోషిగా, కళంకం లేకుండా ఈ ఆజ్ఞను ఉంచుకోమని” అది నిరీక్షణకు సంబంధించిన విషయము అని మళ్లీ చూపిస్తూ ఉద్బోధించాడు. పౌలు దాని కోసం ఎదురుచూశాడు: “ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును.” (2 తిమో. 4:8).
ఈ పదాల యొక్క వ్రాతపూర్వక వినియోగాన్ని బట్టి, అవి అన్నీ ఒకే ఒక సంఘటనను; క్రీస్తువిరోధి యొక్క శక్తులను నాశనం చేయడానికి మరియు తన ప్రజలకు యహువః రాజ్యంలో విశ్రాంతినిచ్చేందుకు క్రీస్తు యొక్క అద్భుతమైన పునరాగమనాన్ని మాత్రమే సూచిస్తున్నాయని మనం నిర్ధారించగలము. అలా కాకుండా ఎవరైనా మరోలా ఎలా ఆలోచించగలరో ఊహించడం కష్టం. ఈ ఆధారం ఏ సందర్భంలోనూ "శ్రమలకు ముందు ఏ క్షణంలోనైనా రాకడ" అనే ఆలోచనకు సరిపోదు.
పేతురు గురించి భవిష్యవాణి
ఇప్పుడు ప్రభువు పరలోకానికి వెళ్ళే ముందు తన శిష్యులకు చెప్పిన ప్రవచనాలను చూద్దాం. ప్రభువు ఏ క్షణంలోనైనా రాబోతున్నాడనే విషయం సరికాదనే ఆధారాన్ని ఇక్కడ మనం మరోసారి కనుగొంటాము. అతని ఆసక్తికరమైన ప్రవచనాలలో యోహాను 21:18-19లో కనుగొనబడిన పేతురు గూర్చిన ప్రవచనం ఒకటి. “నీవు యౌవనుడవైయుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము వలన యహువఃను మహిమపరచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఈ సమయంలో పేతురు క్రీస్తుతో సమానమైన వయస్సులో ఉన్నాడని మనం భావించవచ్చు. కాబట్టి పేతురు తన ముప్పై లేదా నలభై సంవత్సరాల వయసు మధ్యలో హతసాక్షి కావచ్చని తాను ఊహించి ఉండవచ్చు. ముప్పై సంవత్సరాల తరువాత పేతురు స్వయంగా ఇలా వ్రాశాడు, “మరియు మన ప్రభువైన యహూషువః క్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చుననియెరిగి, నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను. నేను మృతిపొందిన తరువాత కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతును.” (2 పేతురు 1:13-15).
ఈ సంభాషణ స్పష్టంగా సంఘమంతటా విస్తృతంగా ప్రసిద్ది చెందింది మరియు ఈ అంచనాను బట్టి ప్రభువు ఏ క్షణంలోనైనా వస్తాడని ఎవరైనా ఎలా అనుకుంటారో ఊహించడం కష్టం. పేతురు సజీవంగా ఉన్నంత కాలం మరియు హతసాక్షి కానంత కాలం అలాంటి సంఘటన అసాధ్యం.
సువార్త కోసం కార్యక్రమం
సువార్త ప్రకటనకు సంబంధించి ప్రభువు సూచనలు కూడా "ఏ క్షణంలోనైనా రాకడ" ను తోసిపుచ్చాయి. దీని గురించి అనేక జాబితాలు ఉన్నాయి, కానీ మనము అపొస్తలుల కార్యములలో ఉన్నదాన్ని తీసుకుందాము: “అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు" (అపొస్తలుల కార్యములు 1:8). ఇది సంఘం కోసమైన కార్యక్రమం, మరియు దాని ప్రతి దశ అపొస్తలులలో స్పష్టంగా గుర్తించబడింది. యెరూషలేములో స్తెఫను సాక్ష్యమిచ్చుట అనేక అధ్యాయాలను తీసుకుంటుంది మరియు 7వ అధ్యాయం చివరి వరకు, అతని మరణం వరకు కొనసాగుతుంది. స్తెఫను బలిదానంతో అతని మరణం యొక్క పర్యవసానం రెండవ మరియు మూడవ దశల నెరవేర్పు ప్రారంభానికి దారితీసింది; అది యూదయ మరియు సమరయలో సాక్ష్యమివ్వడం. సమరయ పరిచర్య ఫిలిప్పు యొక్క పని ద్వారా 8వ అధ్యాయంలో ప్రారంభమైంది మరియు బహుశా ఆరోహణ జరిగిన చాలా సంవత్సరాల తర్వాత వరకు జరిగి ఉంటుంది.
కనీసం ఈ సంఘటనలు జరిగే వరకు ఏ సమయంలోనైనా ప్రభువు తిరిగి రాలేడు. కానీ సువార్త అన్యులకు వెళ్ళే వరకు "భూ దిగంతముల వరకు" వెళ్ళే పరిచర్య ప్రారంభం కాలేదు మరియు ఇది 10 మరియు 11 అధ్యాయాలలో నమోదు చేయబడింది. "భూ దిగంతములు" దేనిని సూచిస్తుంది అనే విషయంలో వ్యాఖ్యాతలు ఖచ్చితంగా అనిశ్చితంగా ఉన్నారు. కానీ తప్పనిసరిగా కనీసం అపొస్తలుల కార్యాల పుస్తకంలో అది మిగిలిన విషయాన్ని కలిగి ఉండాలి. పౌలు అపొస్తలుల కార్యములు 13: 47లో అన్యుల కోసం యెషయా 49: 6ని ఉదహరించుటను గమనించండి. యెషయా 49లోని ఆజ్ఞ వాస్తవానికి సేవకునికి ఇవ్వబడింది, ఆయన స్వయంగా క్రీస్తు, మరియు ఇది సందర్భోచితంగా ఇశ్రాయేలు ప్రజలు తిరిగి సేకరించబడుటకు ముందు అన్యజనులకు వెలుగు వెళ్లడాన్ని సూచిస్తుంది. (ఇక్కడ కాలక్రమం కోసం 4, 5 వచనాలను చూడండి.) ఈ వచనం ప్రభువు ఆజ్ఞాపనకు నేపథ్యం మరియు దాని ఆధారంగానే మత్తయి 24:14 రూపొందించబడింది. ఇక్కడ మళ్ళీ ప్రభువు "ఏ క్షణంలోనైనా వచ్చును" అనే ఆలోచన కొట్టివేయబడుతుంది.
సంఘటనల క్రమం
డిస్పెన్సేషనలిజం యొక్క ప్రధాన వాదన ఏమిటంటే, సంఘం యహువః కోపానికి గురికాదు. "ఎందుకనగా మన ప్రభువైన యహూషువః క్రీస్తుద్వారా రక్షణ పొందుటకే యహువః మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు." (1 థెస్స 5:9). మరియు ఇది నిజమే, కానీ డిస్పెన్సేషనలిస్టులు శ్రమల సమయాన్ని మరియు ప్రభువు దినాన్ని గందరగోళపరుస్తూ మరియు శ్రమల సమయం అనేది యహువః ప్రజలకు బాధ కలిగించే సమయంగా చూపుతూ, సంఘం శ్రమలకు-పూర్వ-పరోసియా వద్ద ఎత్తబడుతుందని మరియు శ్రమల ద్వారా ప్రవేశించే వ్యక్తులు సంఘం కాదని, వారు శ్రమల సమయంలో మారుమనస్సు పొందిన యూదులని చెప్పుదురు.
యహువః తన ప్రజలను తన కోపానికి గురగుటకు అనుమతించడనేది నిజం, కానీ వారిని రక్షించుటకు వారిని పరలోకానికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ప్రకటన 7లో మనం 1,44,000 మంది యూదు విశ్వాసులు ముద్రించబడుటను చూస్తాము. ప్రకటన 9: 4లో వారికి ఏ విధంగానూ హాని కలిగించవద్దని మిడుతలను ఆజ్ఞాపించుట చూస్తే వారు ఇంకా భూమిపై ఉన్నారని స్పష్టమవుతుంది. 91వ కీర్తన ఆ సమయంలో యహువః తన ప్రజలను రక్షించే విధానానికి సంబంధించిన చక్కనైన చిత్రాన్ని మనకు అందిస్తుంది.
క్రీస్తు ఎప్పుడు వస్తాడు? ప్రకటన 16: 15 ఈ క్రింది హెచ్చరికను కలిగి ఉంది: “ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు. ఇది ఏడవ తెగులుకు ముందు సంభవించే, మొత్తం క్రమం యొక్క చివరి సంఘటన, మరియు క్రీస్తు అప్పటికి ఇంకా రాలేదు. మిగిలిన ఏకైక సంఘటన హార్ మెగిద్దోనను యుద్ధం, గొప్ప భూకంపం, వడగళ్లు. ఇది 19వ అధ్యాయం, యెహెజ్కేలు 38-39 అధ్యాయాలు మరియు అనేక ఇతర భాగాలలో మరింత వివరంగా వివరించబడింది. ఈ సంఘటనలు కొద్ది రోజుల్లోనే జరుగుతాయని మనం అనుకోనవసరం లేదు. హార్ మెగిద్దోనులో సైన్యాల సమీకరణకు కొంత సమయం అవసరమనడంలో సందేహం లేదు. ఇటీవలి దశాబ్దాలలో ఇరాక్‌పై జరిగిన రెండు దండయాత్రలను మీరు గుర్తుచేసుకుంటే దండయాత్రలు రాత్రికిరాత్రే ఆకస్మికంగా జరగవు. ఈ కాలంలో ఏదో ఒక సమయంలో క్రీస్తు తన ప్రజలను పునరుత్థానం చేయడానికి తిరిగి వస్తాడు (1 కొరి. 15: 23; దానియేలు 12: 2), మరియు క్రీస్తువిరోధి యొక్క శక్తులను నాశనం చేస్తాడు. మనము దీని కంటే నిర్దిష్టంగా చెప్పలేము కానీ మనం దాని కోసం ఆశతో ఎదురుచూడవచ్చు.
ప్రభువు దినాన జరిగే క్రీస్తు రాకడ రెండు థెస్సలొనీకయుల పత్రికల్లోనూ విశేషముగా నిర్ధారించబడింది. హాస్యాస్పదంగా, ఈ రెండు పత్రికలు శ్రమల-పూర్వ దృక్పథాన్ని నిరూపించడానికి ఉపయోగించబడ్డాయి, అయితే అవి రెండూ చెప్పుకోదగిన రీతిలో దానికి వ్యతిరేకంగాసాక్ష్యమిస్తున్నాయి.
1 థెస్సలొనీకయులు 5: 1,2: “సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.” ఈ అధ్యాయం 4వ అధ్యాయంలో చెప్పబడిన దానితో అనుబంధాన్ని అస్పష్టం చేస్తుంది. "కాలములు మరియు సమయములు" యొక్క పూర్వస్థితి మునుపటి అధ్యాయంలో పేర్కొన్న పరోసియాని మాత్రమే సూచిస్తుంది. కాబట్టి ప్రభువు దినం అనేది కొత్త విషయం కాదు కానీ అదే సందేశానికి కొనసాగింపు.
రెండవ పత్రిక కూడా పరోసియా, క్రీస్తుతో మన కలయికను మరియు ప్రభువు దినాన్ని ఐక్యం చేస్తుంది మరియు ప్రభువు దినం ఇప్పటికే ప్రారంభమైందనే భావనకు వ్యతిరేకంగా వారిని హెచ్చరిస్తుంది. "మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని" ఆ దినము రాదు (2 థెస్స. 2:3).
1 కొరింథీయులు 15: 50-58లో సమయ పరంపర యొక్క సూచన లేదు, మరియు క్రీస్తు రాకడ శ్రమలకు ముందు జరగాలని చెప్పేది ఖచ్చితంగా ఏదీ లేదు. అయితే, కడ బూర (15: 52) ప్రస్తావన దానిని 1 థెస్సలొనీకయులు 4:13-18 తోను మరియు ప్రకటన గ్రంథంలోని ఏడవ మరియు చివరి బూరతోను (11:15; 20:1-4) అనుసంధానం చేస్తుంది. ఇది సంపూర్ణ పొందికను సృష్టిస్తుంది.
ప్రవచనాత్మక సంఘటనలను సరిగ్గా అర్థం చేసుకొనుట యొక్క ప్రాముఖ్యత, ముఖ్యంగా క్రీస్తు రాకడను గూర్చి అర్థం చేసుకొనుట, థెస్సలొనీకయుల పట్ల పౌలు యొక్క వైఖరి ద్వారా స్పష్టంగా చూపబడింది. అతడు నగరంలో కేవలం మూడు వారాలు మాత్రమే గడిపాడు, అయినప్పటికీ అతడు పూర్తిగా పాపపురుషుడు వచ్చుట, మతభ్రష్టత్వం, ప్రభువు దినం మరియు క్రీస్తు రాకడ (పరోసియా) లను గురించి వారికి పూర్తిగా బోధించాడని 2 థెస్సలొనీకయులు 2 నుండి స్పష్టమవుతుంది. ఇంకా, అతడు చాలా మంది సమకాలీన క్రైస్తవుల వలె తప్పుడు, కొత్త అభిప్రాయాలను అనుమతించదగినవిగా పరిగణించలేదు.
ఇది జాన్ కన్నిఘమ్ రాసిన WLC కాని వ్యాసం.
మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.