ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము. |
ప్రభువైన యహూషువః క్రీస్తు యొక్క వ్యక్తిగత పూర్వ-ఉనికిని విశ్వసించేవారు తరచుగా 1 కొరింథీయులు 10:4లోని అపొస్తలుడైన పౌలు యొక్క మాటలను చూపిస్తారు, అక్కడ అతడు అరణ్యంలో ఉన్న ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ "అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే'' అని చెప్పాడు.
ఇశ్రాయేలు ప్రజలు అరణ్యం గుండా వాగ్దాన భూమికి ప్రయాణించే సమయంలో క్రీస్తు స్వయంగా వారితో పాటు వెళ్లాడని దీని నుండి వాదించబడుతుంది. ఈ వాక్యం తరచుగా అనేక పాత నిబంధన లేఖనాలతో ముడిపడి ఉంటుంది, ఇది యహువఃను ఒక రాయిగా వర్ణిస్తుంది (ద్వితీ. 32:4; కీర్త. 18:2, 31). యహువః ఒక రాయి, మరియు క్రీస్తు కూడా ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్న రాయి కాబట్టి, క్రీస్తు తప్పనిసరిగా యహువః అయి ఉంటాడని విశ్వాసులు నమ్ముతారు.
లోపభూయిష్ట వివరణ
ఈ వివరణ, సాధారణమైనదైప్పటికీ, ఇది అనేక తీవ్రమైన లోపాలతో నిండియుంది. వీటిలో మొదటిది “క్రీస్తు” అనే పదానికి గల అర్థానికి సంబంధించినది. చాలా తరచుగా మనము దానిని యహూషువఃకు సరైన పేరుగా ఉపయోగిస్తాము, అది అతని ఇంటిపేరు (చివరి పేరు) అయినట్లు. “క్రిస్టోస్” అనే హెబ్రీ పదం “మెస్సీయ” యొక్క గ్రీకు రూపం, దీనికి “అభిషిక్తుడు” అని అర్థం. ఇది ఇశ్రాయేలీ రాజులకు ఇవ్వబడే బిరుదు. దావీదు ఒక "మెస్సీయ" మరియు అతడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించి, యహువః రాజ్యాన్ని స్థాపించబోయే వ్యక్తికి ఒక సాదృశ్యంగా మరియు ముందస్తు సూచనగా ఉన్నాడు.
మెస్సీయ రాకడ అనేది పాత నిబంధన ప్రవచనం యొక్క సాధారణ ఇతివృత్తం. అతడు స్త్రీ సంతానం (ఆది. 3:15), అబ్రాహాము సంతానం (ఆది. 22:18; గల. 3:16, 19), యూదా సంతానం (ఆది. 49:10; 1 దిన 5:2), మరియు దావీదు సంతానం (2 సమూ. 7:12-14; యెష. 11:1, 10; రోమా. 1:3; 2 తిమో. 2:8).
ఈ లేఖనాలన్నింటిలో “బీజం/విత్తనం” అంటే “వారసుడు” అని అర్థం. మెస్సీయ మానవ జాతి నుండి ఉద్భవించాడని ప్రవచించబడిన వాస్తవాన్ని ఇది సూచిస్తుంది. వాగ్దానం చేయబడిన విత్తనం అప్పటికే మరొక రూపంలో ఉనికిలో ఉందని పాత నిబంధనలో ఏ ప్రవచనమూ సూచించలేదు. మెస్సీయ వాస్తవంగా మరియు వ్యక్తిగతంగా అరణ్యంలో ఉన్నాడని పౌలు బోధించడం ప్రవక్తల మాటలకు ప్రత్యక్ష విరుద్ధంగా ఉంటుంది.
మరో అభ్యంతరం
ఈ సిద్ధాంతానికి రెండవ ప్రధాన అభ్యంతరం ఏమిటంటే, ఇశ్రాయేలుకు పరిచర్య చేయడానికి యహువః దూతలను ఉపయోగించాడు. ధర్మశాస్త్రం దూతల ద్వారా ఇవ్వబడినదని కొత్త నిబంధన మూడు ప్రదేశాలలో ప్రకటించింది (అపొస్తలు 7:38, 53; గల. 3:19; హెబ్రీ. 2:2). ఈ ప్రతి భాగంలో దూత ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబబడిన వాస్తవం వాదనలో ముఖ్యమైన భాగాన్ని ఏర్పరుస్తుంది. ప్రతి ఒక్క దానిని సందర్భానుసారంగా జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ధర్మశాస్త్రానికి సువార్త యొక్క ఆధిక్యతను మీరు సాధారణ ఇతివృత్తంగా చూస్తారు. ధర్మశాస్త్రం దూతల ద్వారా మాత్రమే ఇవ్వబడింది, అయితే సువార్త యహువః కుమారుని ద్వారా తీసుకురాబడింది మరియు అందువల్ల దాని కంటే చాలా ఉన్నతమైనది. కాబట్టి ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడంలో గానీ, అరణ్యంలో ఇశ్రాయేలీయులకు పరిచర్య చేయడంలో గానీ క్రీస్తుకు ఎలాంటి భాగమూ ఉండకపోవచ్చు.
మెస్సీయ వ్యక్తిగతంగా అరణ్యంలో ఉండలేడు కాబట్టి, పౌలు యొక్క ప్రకటనలో ఆ బండ ఏదో ఒక విధంగా క్రీస్తును సూచిస్తుందని లేదా సాదృశ్యంగా ఉందని అర్థం. "ఉండుట" అనే క్రియను ప్రాతినిధ్య అర్థంలో ఉపయోగించడం లేఖనానికి అసాధారణం కాదు. యహూషువః ఇలా అన్నాడు, "నేనే ద్వారమును" (యోహాను 10:7); "నేనే నిజమైన ద్రాక్షావల్లిని" (యోహాను 15:1). ప్రభువు యొక్క పస్కా భోజనంలో ఆయన రొట్టెను "నా శరీరం" అనియు మరియు పాత్రను "నా రక్తం" అనియు చెప్పాడు (1 కొరిం. 11:24-25), అనగా అవి ఆయన చిరిగిన శరీరాన్ని మరియు చిందించిన రక్తాన్ని సూచిస్తాయని స్పష్టంగా అర్థం.
రూపక సమాంతరాలు
1 కొరింథీయులు 10లోని 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న మొత్తం భాగాన్ని నిశితంగా అధ్యయనం చేయడం ద్వారా ఈ వివరణ బలపడుతుంది. ఇశ్రాయేలీయుల అనుభవాలు మనకు ఉదాహరణగా ఉన్నాయని పౌలు రెండుసార్లు పేర్కొన్నాడు (6, 11 వచనాలు). ఇక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదానికి నిజానికి “గురుతులు/రూపములు” అని అర్థం.
ఇశ్రాయేలీయులు మేఘం గుండా మరియు ఎర్ర సముద్రం గుండా వెళ్ళడం క్రైస్తవ బాప్తీస్మానికి "గురుతు". మనం "క్రీస్తులోకి" బాప్తీస్మం (రోమా. 6:3; 1 కొరి. 12:13; గల. 3:27) పొందినట్లే వారు "మోషేలోకి" (2 వ వచనం, NASB) బాప్తీస్మం పొందారు. 3 మరియు 4 వచనాలు నిర్గమకాండము 16లో మన్నాను ఇచ్చిన సంఘటనలను మరియు రెఫీదీము, కాదేషులో అద్భుతంగా ఒక రాతి నుండి యహువః నీటిని రప్పించిన సంఘటనలను సూచిస్తూ రూపక సమాంతరంగా కొనసాగుతాయి (నిర్గ. 17:1-7; సంఖ్య. 20:1-13).
3వ వచనంలో పేర్కొనబడిన “ఆత్మీయ ఆహారం” స్పష్టంగా 40 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీయులకు ప్రతిరోజు అద్భుతంగా ఇవ్వబడిన మన్నాకు గురుతు. మన్నా ఇవ్వడం నిర్గమకాండము 16లో నమోదు చేయబడింది మరియు యోహాను 6కి నేపథ్యాన్ని ఏర్పరుస్తుంది.
రెండు రాతి సంఘటనలు
ఇశ్రాయేలీయుల అరణ్య సంచారం సమయంలో బండకు సంబంధించిన రెండు సంఘటనలు నమోదు చేయబడ్డాయి మరియు వాటి మధ్య వ్యత్యాసాన్ని గమనించడం చాలా ముఖ్యం.
అద్భుతంగా మన్నా ఇవ్వబడిన తరువాత వెంటనే మొదటి సంఘటన జరిగింది. ఇశ్రాయేలీయులు రెఫీదీము వద్దకు చేరుకొని (నిర్గమ. 17:1) వెంటనే నీటి కొరత గురించి ఫిర్యాదు చేయడం ప్రారంభించారు, ఆ తర్వాత బండను కొట్టమని యహువః మోషేకు ఆజ్ఞాపించాడు. అలా నీరు ప్రవహించి ప్రజల దాహార్తిని తీర్చింది. రాతిని కొట్టడం అనేది మన బండ అయిన క్రీస్తు మన కోసం కొట్టబడిన వాస్తవాన్ని సూచిస్తుంది. అద్భుతంగా నీరు ఇవ్వబడడం అనేది జీవజలమైన పరిశుద్ధాత్మను ఇవ్వబడడాన్ని సూచిస్తుంది (యోహాను 7:37-39).
రెండవ సంఘటన అరణ్య సంచారం ముగింపులో జరిగింది. ఇశ్రాయేలీయులు మళ్లీ నీటి కొరత గురించి ఫిర్యాదు చేయగా యహువః మళ్లీ వారి అవసరతను తీర్చాడు. అయితే, ఈసారి, ఆయన మోషేకు రాతితో మాట్లాడమని స్పష్టంగా సూచించాడు, కానీ మోషే తన కోపంతో అవిధేయత చూపి ఆ బండను రెండుసార్లు కొట్టాడు (సంఖ్యా. 20:1-12).
బండతో మాట్లాడటానికి బదులు దానిని కొట్టడంతో, మోషే ఆ గురుతును నాశనం చేసినందుకు దోషిగా ఉన్నాడు. నిర్గమకాండము 17లోని రాయి మనకు జీవజలమును ఇచ్చుటకు కొట్టబడిన శరీరములో ఉన్న క్రీస్తును సూచించింది, అయితే సంఖ్యాకాండము 20లోని రాయి క్రీస్తును మన ప్రధాన యాజకునిగా సూచించింది, రెండుసార్లు కొట్టబడదు (హెబ్రీ. 6:6), కానీ కేవలం జీవజలం సరఫరా చేయబడడం కోసం మాట్లాడి ఉండాలి.
మొదటి సంఘటన సంచారం ప్రారంభంలో జరిగింది, రెండవది ముగింపులో; ఈ రెండు సంఘటనలు మన “అరణ్య సంచారం” సమయంలో తన ప్రజలతో క్రీస్తు నిరంతర ఉనికికి ఉపమానంగా రూపొందాయి.
మనము చూసిన రెండు సంఘటనలు పూర్తిగా భిన్నమైన ప్రదేశాలలో జరిగాయి మరియు ప్రతి ప్రదేశంలో "రాతి" కోసం వేర్వేరు హెబ్రీ పదాలు ఉపయోగించబడ్డాయి. నిర్గమకాండము 17లో వినియోగించిన పదం త్సూర్ మరియు సంఖ్యాకాండం 20లో వినియోగించిన పదం సెల. కాబట్టి పౌలు “వారు తమను అనుసరించిన ఆ ఆత్మీయ బండ నుండి త్రాగిరి” అని చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి? సహజంగానే ఒక అక్షరార్థమైన రాయి ఇశ్రాయేలీయులను అరణ్యంలో వెంబడించలేదు మరియు క్రీస్తు స్వయంగా వారితో వెళ్లాడనడానికి ఇది రుజువు అని చాలామంది భావిస్తున్నారు. సమాధానం ఏమిటంటే, పౌలు క్రైస్తవ అనుభవ భాషని ఉపయోగిస్తున్నాడు మరియు దానిని పాత నిబంధన చిహ్నంలోకి తిరిగి చదువుతున్నాడు. 1 మరియు 2 వచనాలలో బాప్తీస్మం గురించి అతని సూచన ద్వారా ఇది స్పష్టంగా చూపబడింది. ఇశ్రాయేలీయులు అక్షరార్థంగా "బాప్తీస్మం" పొందలేదు. వాస్తవానికి, నీరు వారి దగ్గరికి రాలేదని మనకు చెప్పబడింది; వారు ఎర్ర సముద్రం గుండా పొడిగా నడిచారు. కానీ పౌలు వారు “మోషేలోకి బాప్తిస్మము పొందారు” అని చెప్పడం వారి అనుభవానికి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే రాయి వారిని అక్షరాలా అనుసరించలేదు. ఇది జీవితం ద్వారా మనతో పాటుగా ఉన్న క్రీస్తుకు ఒక గురుతు.
ఇది జాన్ కన్నింగ్హామ్ రాసిన వ్యాసం. WLC వ్యాసం కాదు.
మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్సి బృందం.