మీకు ప్రతి వారం చర్చికి వెళ్ళడం అలవాటుగా ఉన్నట్లైతే ఇంటి చర్చి విషయం భయంగా అనిపించవచ్చు. ఏదేమైనా, మీరు ఒక చిన్న సమూహంగా, మీ సొంత కుటుంబంతో, లేదా మీరు ఒంటరిగా ఆరాధన చేస్తున్నా, ఇంట్లోనే ఆరాధిస్తూ విశ్రాంతి దినపు గొప్ప ఆశీర్వాదాన్ని పొందవచ్చు.
|
ప్రకటన 18 లో బబులోనును విడిచిపెట్టమని స్పష్టమైన ఆజ్ఞ ఇవ్వబడింది: “నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి వెళ్ళండి.” (1599 జెనీవా బైబిల్). ఏ మతశాఖకు మినహాయింపు లేదు. అన్ని శాఖలు మరియు తెగలు తప్పు వలన కలుషితమయ్యాయి.
కానీ అది ఒక సమస్యను తెస్తుంది. సంఘ హాజరు ఆరాధనకు పర్యాయపదంగా మారింది. కాబట్టి, విశ్వాసులు ఎక్కడ ఆరాధించాలి (మరియు ఎలా!)?
ఆరాధన అనేది ఒక చర్య క్రియ. ఇది ఇలా నిర్వచించబడింది: “ఆరాధించుట; దేవునికి వందనాలు చెల్లించుట; అత్యున్నత గౌరవం మరియు భక్తి చెల్లించుట." 1 ఇది షఖాహ్/shâchâh అనే హెబ్రీ పదం నుండి వచ్చింది, దీనర్థం ఆరాధనలో నమస్కరించుట. "ఆరాధనలో [యహువః] ముందుకు వచ్చుటకు ఇది సాధారణ పదం." 2 ఇది ప్రతి ఒక్కరూ ఇంట్లో తమ కుటుంబంతో లేదా ఒంటరిగా కూడా చేయగల పని. వాస్తవానికి, సబ్బాతు రోజున ఇంట్లో ఉండుటకు బైబిల్ ప్రాధాన్యత ఉంది!
నిర్గమకాండం 16 లో, సీనాయి వద్ద ధర్మశాస్త్రం ఇవ్వడానికి ముందు, యహువః మోషేతో ఇలా అన్నాడు: “చూడుడి నిశ్చయముగా యహువః ఈ విశ్రాంతిదినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీ కనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి యుండవలెను. ఏడవ దినమున ఎవడును తనచోటనుండి బయలు వెళ్లకూడదనెను. కాబట్టి యేడవ దినమున ప్రజలు విశ్రమించిరి..” (నిర్గమకాండము 16: 29-30 చూడండి.) ఇశ్రాయేలీయులు ప్రతి సబ్బాతు దినమున గుడారం చుట్టూ నిలబడలేదు, లేదా మోషే ఉపన్యాసం వినుటకు ప్రత్యక్ష గుడారం యొద్దకు వెళ్ళలేదు. బదులుగా, ప్రతి కుటుంబం తమ సొంత ఇళ్లలోనే ఉండి యహువఃను ఆరాధించిరి.
మీరు కూడా చేయవచ్చు.
గృహ ఆరాధన
రక్షణ ఎల్లప్పుడూ ఒక వ్యక్తిగత విషయం, సమూహ కార్యకలాపం కాదు. ఇంట్లో ఆరాధన అనేది యహువఃకు పూర్తిగా ఆమోదయోగ్యమైనది మరియు వాస్తవానికి నిజ ఆరాధన యొక్క ఆత్మకు అనుగుణంగా ఉంటుంది. గృహ ఆరాధనను ఆత్మీయంగా గొప్ప అనుభవంగా మార్చుటకు కొన్ని ఆలోచనలు క్రింద ఇవ్వబడినవి.
ఒంటరిగా ఆరాధించుట
బబులోను నుండి బయటకు వచ్చు చాలా మంది విశ్వాసులు దీనిని ఒంటరిగా చేయవలసి వస్తుంది. గొర్రెపిల్ల వెళ్లు త్రోవలను వెంబడించుట చాలా ఒంటరి నడక. అయితే, మీరు ఈ కోవలో మిమ్మును కనుగొంటే, మీ స్తోత్రములు మరియు ఆరాధన యహువః చేత ఎంతగానో ఆదరించబడును [ఆయన తన కుమారుని ప్రపంచంలో మరే వ్యక్తికి ఇవ్వనట్లుగా]. మీరు సృష్టికర్తతో గడిపిన సమయం అర్ధవంతమగుట కోసం, ఈ క్రింది వాటిని చేయుట గూర్చి ఆలోచించండి:
- ప్రార్థన పుస్తకాన్ని ప్రారంభించండి. మీరు ప్రార్థిస్తున్న వ్యక్తుల లేదా పరిస్థితుల జాబితాను రూపొందించండి. మీ అభ్యర్థనలలో చాలా నిర్దిష్టంగా ఉండండి మరియు వారంలోని మీ ప్రార్థన జాబితాపై ప్రార్థించండి. విశ్రాంతిదినాలలో, మీ జాబితాను సమీక్షించండి మరియు మీరు పొందియున్న ప్రార్థన సమాధానాలను రాయండి. మీరు పొందిన సమాధానాలను చూచుట మీ విశ్వాసాన్ని పెంచుతుంది.
- ఒంటరిగా ఆరాధించుట వలన మీరు వేరొకరి అభిరుచులకు లేదా పరిమితులకు కట్టుబడి ఉండరు. మీరు యః వాక్యాన్ని లోతుగా త్రవ్వవచ్చు. లేఖనం యొక్క కొంత భాగాన్ని అధ్యయనం చేయండి. తరువాత ఇలా ప్రశ్నించుకోండి: 1) ఇది యహువః గురించి ఏమి తెలుపుతుంది? 2) ఇది నా గురించి ఏమి వెల్లడిస్తుంది? 3) ఇది నా జీవితంలో యహువః సంకల్పం గురించి ఏమి తెలుపుతుంది? విశ్రాంతిదినము అనేది మన సృష్టికర్తతో సన్నిహిత సహవాసానికి సమయం. యహువః వాక్యాన్ని చదువుట, ప్రకటించుట, జ్ఞాపకం చేసుకొనుట మరియు కంఠస్థం చేయుట ద్వారా ఆయన వాక్యంలో సమయాన్ని గడపడం వల్ల హృదయం ఆయనకు సమీపమౌతుంది. సాంప్రదాయ సంఘ ఆరాధన సేవల యొక్క ఇరుకైన పరిమితుల కంటే, ఇంట్లో ఆరాధించునప్పుడు లేఖనంలో పూర్తిగా మునిగిపోవుట మరింత సాధ్యమవుతుంది.
- ప్రకృతిలో సమయం గడపడం కూడా సృష్టికర్త యొక్క సాన్నిహిత్యాన్ని మరియు శక్తిని ఆస్వాదించుటలోని ఒక శక్తివంతమైన మార్గం. ఒకవేళ అది నగర పార్కులోని ఒక నిశ్శబ్ద మూల మాత్రమే అయినప్పటికీ, ఆ ప్రకృతి మన హృదయాన్ని సృష్టికర్త యొద్దకు ఆకర్షిస్తుంది.
కుటుంబంతో ఆరాధించుట
మీతోపాటు బబులోనును విడిచిన కుటుంబం కూడా ఉంటే, మీరు నిజంగా ఆశీర్వదించబడినట్లే. మీ కుటుంబానికి అర్ధవంతమైన ఆరాధన అనుభవాన్ని అందించే ఆలోచనలో మునిగిపోకండి. ఇంటి ఆరాధన మీరు చేయగలిగినంత తేలికగా లేదా సంక్లిష్టంగా ఉండవచ్చు. అయితే యహువఃతో సమయాన్ని గడిపే వారందరికీ గొప్ప ఆశీర్వాదం ఎదురుచూస్తుంది.
- యహువఃకు స్తుతి పాటలు పాడుటకు మీరు పైప్ ఆర్గాన్ ను[సంగీత వాయిద్యమును] కలిగి ఉండవలసిన అవసరం లేదు. తండ్రిని చురుకుగా స్తుతిస్తూ గడిపిన సమయం హృదయాలన్నిటిని పైకి ఆకర్షిస్తుంది. మీరు మీ సొంత పాటల పుస్తకాలను కలిగియుండవచ్చు, లేదా రికార్డు చేయబడిన సంగీతం వెంబడి పాడవచ్చు, అయితే మీరు దీన్ని ఎలా చేసినా, పాడుట కూడా ప్రార్థన వలె ఆత్మపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది.
- రక్షణ యొక్క చక్కదనాన్ని చిన్న పిల్లలకు కూడా తేలికగా మరియు అర్థమయ్యే విధంగా చెప్పండి. మీరు వారి జీవితాంతం నిలిచిపోయే పునాదిని వేస్తున్నారు. ఒక బైబిల్ కథనాన్ని చదివి, ఆపై అది యహువః ప్రేమ మరియు కాపుదల గురించి ఏమి తెలియజేస్తుందో మీ స్వంత మాటలలో అనువదించండి.
- బైబిల్ క్విజ్లు పిల్లలకు గ్రంథాన్ని నేర్పుటకు ఒక ఆహ్లాదకరమైన మార్గం. వాటిని పుస్తకాలలో లేదా ఆన్లైన్లో పొందవచ్చు.
- ప్రతి కుటుంబ సభ్యుడిని, సాధ్యమైన చోట, ఆరాధన అనుభవంలో సహకరించమని అడగండి. అందరికీ గొప్ప ఆశీర్వాదం ఉంటుంది.
స్నేహితులతో కలిసి ఆరాధించుట
ఏక మనస్సుగల విశ్వాసుల సమూహంతో ఆరాధించుటను గూర్చి చాలా ప్రత్యేకమైన విషయం ఉంది. ఏదేమైనప్పటికీ, బబులోను యొక్క ఆరాధన-శైలిని మాత్రం అనుకరించకుండా, దాని ఆరాధన రూపంలోకి మీ ఆరాధన అనుభవం దిగజారిపోకుండా తప్పక జాగ్రత్త వహించాలి.
- ఒక సమూహ అమరికలో యహువఃకు మరియు తోటి విశ్వాసులకు సన్నిహితంగా మారునిమిత్తం “ఏక మనస్సుతో ప్రార్థించుట” చాలా శక్తివంతమైన మార్గం. ఒక వ్యక్తి మాత్రమే ప్రార్థన చేయుట కాకుండా, మొదట ఒక వ్యక్తి తన హృదయంలో ఉన్నదాన్ని చెప్పుట ద్వారా ప్రారంభించగా, మరొకరు/మిగిలిన వారు యః యొక్క ఆత్మతో కదిలింపబడినట్లుగా అతడితో కలిసి ప్రార్థించాలి. “ఆమేన్” తో అంతరాయం కలిగించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది నిజంగా ఒక ప్రార్థన. “ఏక మనస్సుతో” చేయు ప్రార్థనలలో మాట్లాడుటకు మరియు ఆత్మను కదిలించే విధంగా ఆలోచనలను జోడించుటకు ప్రతిఒక్కరూ స్వేచ్ఛకలిగి ఉంటారు, ఇది యహువఃకు మరియు అన్ని వయసుల ఆరాధకులకు మధ్య సంభాషణగా మారుతుంది. ఇటువంటి సన్నిహిత, పరస్పర ప్రార్థనా సమయం ఏ ఆరాధనా సేవకైనా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. విశ్వాసులు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నప్పుడు నలభై ఐదు నిమిషాల నుండి గంట వరకు వేగంగా గడిచిపోతుంది, కాబట్టి కొంతమందికి కూర్చోవడం అవసరమైతే, దానిని అనుమతించాలి.
- యహువః ఆశీర్వాదాలకు సంబంధించి వ్యక్తిగత సాక్ష్యాలను పంచుకునే సమయం యహువఃను గౌరవించుటకు మరియు అక్కడ ఉన్న వారందరిలో విశ్వాసాన్ని ప్రేరేపించు ఒక అద్భుతమైన మార్గం. నిజానికి, మలాకీ 3 ఇలా పేర్కొంది:
అప్పుడు, యహువఃయందు భయ భక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా,
యహువః చెవియొగ్గి ఆలకించెను;
మరియు యహువఃయందు భయభక్తులు కలిగి
ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా
ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.
నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమైయుందురు;
తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు
నేను వారిని కనికరింతునని
సైన్యములకు అధిపతియగు యహువః సెలవిచ్చుచున్నాడు. (మలాకీ 3: 16-17 చూడండి.)
చిన్న పిల్లలు కూడా వారమంతా వారు అనుభవించిన ఆశీర్వాదాలను సాక్ష్యంగా పంచుకొనుటలో చేరవచ్చు.
- గృహ ఆరాధన విషయంలో సృజనాత్మకతను గూర్చి భయపడకండి. అందరికీ బోధించుటకు ఒక వ్యక్తి ఉపన్యాసం సిద్ధం చేయవలసిన అవసరం లేదు. సామూహిక బైబిలు అధ్యయనం, బలపరుచు వీడియోలు, డబ్ల్యుఎల్సి రేడియో కార్యక్రమాలు కూడా వివిధ వయసులవారు గల బృందంలో యహువఃను ఆరాధించే మార్గాలుగా ఉంటాయి.
నిజమైన ఆరాధన అనేది వరుసలలో కూర్చొనుట, ఒక వ్యక్తి బోధించుట, వినుట కంటే చాలా ఎక్కువ. ప్రార్థన, పాటలు మరియు సాక్ష్యాలతో కూడిన పరస్పర ఆరాధన యహువఃను గౌరవిస్తుంది మరియు హృదయాలను ఆయన యొద్దకు ఆకర్షిస్తుంది.
ఒంటరిగా వెళ్ళవలసి వచ్చినా, బబులోనును విడిచి రండి అనే ఆజ్ఞను పాటించువారందరి కొరకు అధికమైన ఆశీర్వాదం ఎదురుచూస్తుంది.
యహువః నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల; విశ్రాంతిదినము మనోహరమైనదనియు యహువఃకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల; నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల: నీవు యహువః యందు ఆనందించెదవు; దేశము యొక్క ఉన్నతస్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను: యహువః సెలవిచ్చిన వాక్కు ఇదే.
|
మీరు ఇంట్లో ఎలా ఆరాధించవచ్చుననే దానిపై మరిన్ని ఆలోచనల కోసం, WLC రేడియోలో “వర్షిపింగ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్” ను వినండి.
|
1 నోవాహ్ వెబ్స్టర్, అమెరికన్ డిక్షనరీ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, 1828.
2 # 7812, ది న్యూ స్ట్రాంగ్స్ ఎక్స్పాండెడ్ డిక్షనరీ ఆఫ్ బైబిల్ వర్డ్స్, 2001 సం.